వానకాలం రావడంతో రైతులు పంటలు వేసే పనిలో బిజీ అయిపోయారు. దీంతో రైతులకు సాయంగా రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో గురువారం రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈనెల 30వ తేదీన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లు సమాచారం. మధిరలో జరగనున్న భారీ బహిరంగ సభలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారో తెలియాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టత లేదు. 

కాగా, గత యాసంగి పంట సమయంలో కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. అదికూడా.. సమయానికి ఇవ్వలేదు. మరోవైపు, యూరియా కూడా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ పై రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.