దుబాయి : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. తమ నౌకాదళ యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిగాయని ఆరోపిస్తూ అమెరికా మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లపై శనివారం దాడులు చేసింది. ఇరాన్‌కు చెందిన నౌకాదళాన్ని అవసరమైతే పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. గస్తీ నిర్వహిస్తున్న సమయంలో అమెరికా విమాన వాహక నౌక, ఓ డిస్ట్రాయర్‌పై ఇరాన్ దాడులకు పాల్పడినట్లు అమెరికా సైన్యం తెలిపింది. అయితే తమ సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని ప్రకటించింది.

దాడుల్లో రెండు ఇరాన్ చమురు నౌకలు శాశ్వతంగా పనిచేయకుండా పోయాయని, మరో ఖాళీ ట్యాంకర్‌ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఖర్గ్ ద్వీపం సమీపంలో ఒక ట్యాంకర్‌ను, జాస్క్ సమీపంలో మరో ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకున్నామని, ఖాళీగా ఉన్న మూడో ట్యాంకర్‌పై గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో దాడి చేసినట్లు పేర్కొంది. దాడులకు సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా అమెరికా సైన్యం విడుదల చేసింది. ఇరాన్ శక్తివంతమైన రెవల్యూషనరీ గార్డ్, అలాగే ప్రాంతంలోని దాని మద్దతు పొందుతున్న సాయుధ సంస్థలకు నిధులు సమకూర్చే రహస్య చమురు రవాణా నెట్‌వర్క్‌లో ఈ నౌకలు భాగమని అమెరికా ఆరోపించింది. అంతకుముందు పర్షియన్ గల్ఫ్‌లోని ఖర్గ్ ద్వీపం సమీపంలో తమ చమురు ట్యాంకర్‌పై అమెరికా దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది.

నెల రోజుల ప్రశాంతతకు తెర

అమెరికా-ఇరాన్ మధ్య నెల రోజులపాటు కొనసాగిన ప్రశాంతతకు దాదాపు వారం క్రితం తెరపడింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధంలో ఇరుపక్షాలు తిరిగి పరస్పర దాడులకు దిగాయి. సైనికపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రత్యర్థిపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి.