
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకే వామపక్ష పార్టీల మద్దతు కోరింది. టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగంను కలిసి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చెన్నైలోని వామపక్ష పార్టీల కార్యాలయాలకు స్వయంగా వెళ్లిన నిర్మల్ కుమార్, పార్టీ అధ్యక్షుడు విజయ్ తరఫున మద్దతు కోరుతూ లేఖలను అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్య అధికారాన్ని పంచుకునేందుకు టీవీకే సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటేనే ఆయా పార్టీలు తమ సిద్ధాంతాలు, విధానాలను అమలు చేయగలవు అని నిర్మల్ కుమార్ అన్నారు. ప్రస్తుతం టీవీకేపై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా స్పష్టం చేశారు.ఇప్పటికే వామపక్ష పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్‌కు మద్దతు కోరుతూ టీవీకే లేఖలు పంపిందని ఆయన తెలిపారు.
తమ అభ్యర్థనపై స్పందించేందుకు ఆయా పార్టీలు కొంత సమయం కోరినట్లు చెప్పారు. టీవీకేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ మద్దతు కోరారా అని మీడియా ప్రశ్నించగా, మేము అడగలేదు.. అడిగే ఉద్దేశం కూడా లేదు అని నిర్మల్ కుమార్ స్పష్టం చేశారు. 234 సభ్యుల తమిళనాడు అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకు మద్దతు ప్రకటించింది. చట్టం ప్రకారం అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించాలని నిర్మల్ కుమార్ అన్నారు. ప్రజలు టీవీకేకు తీర్పు ఇచ్చారు. విజయ్‌ను తప్పకుండా ఆహ్వానించాలి. మేము ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు హక్కు కోరాం. ఒక రోజు వేచి చూస్తాం అని తెలిపారు. తమిళనాడు ప్రజల తీర్పు ప్రకారం విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆయన అన్నారు.
టీవీకే మద్దతుపై త్వరలో నిర్ణయం: తిరుమావళవన్
ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకే పంపిన మద్దతు లేఖ తమకు అందిందని, విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అన్న విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ తెలిపారు. టీవీకే నుంచి మద్దతు కోరుతూ లేఖ వచ్చింది. అందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. విజయ్ అభ్యర్థనను మేము విస్మరించలేదు. మా పార్టీలో ఒక విధానం ఉంది. అందుకే మా ఉన్నతస్థాయి కమిటీ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. మద్దతు ఇవ్వడం వల్ల లాభనష్టాలపై చర్చిస్తాం అని తిరుమావళవన్ మీడియాతో అన్నారు.
అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఇంకా ఆహ్వానించకపోవడంపై కూడా ఆయన స్పందించారు. విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించాలని కోరారు. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు.. ప్రజల తీర్పు కూడా అదే అని ఆయన అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే విజయ్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపించాలని గవర్నర్ చెప్పడం సరికాదని తిరుమావళవన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసెంబ్లీ వేదికపైనే మెజారిటీ నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.













