మహిళ మెడలోని చైన్‌స్నాచింగ్ చేసేందుకు యత్నిస్తున్న రౌడీషీటర్‌ను ఆటో డ్రైవర్ అడ్డుకున్నాడు. తనకు అడ్డువచ్చిన ఆటోడ్రైవర్‌పై రౌడీషీటర్‌పై కర్రతో దాడి చేస్తున్నా ఏ మాత్రం భయపడకుండా నిందితుడి నుంచి మహిళను కాపాడాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు రాకున్నా ఆటోడ్రైవర్ మహళను కాపాడి శభాష్ అని పించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తన కార్యాలయానికి పిలిపించుకుని ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటోడ్రైవర్‌ను అభినందించారు, సన్మానం చేసి, రివార్డు అందజేశారు.మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మంజు ఓమ్లతా, తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్‌పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయాడు.

బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఆటో సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు. సంఘటన స్థలాన్ని దాటి సుమారు 100 మీటర్ల దూరం ముందుకు వెళ్లినప్పటికీ, జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్‌ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. దీంతో నిందితుడు కర్రతో ఆటో డ్రైవర్‌పై దాడి చేస్తున్నా, భయపడకుండా అడ్డుకున్నారు. అదే వారి నుంచి రౌడీషీటర్ తప్పించుకుని పారిపోతుండగా పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆటోడ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా, ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలిపారు. వెంటనే సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించగా, చైన్‌స్నాచింగ్‌కు సబంధించిన మొత్తం వీడియో రికార్డైంది. ఆటో నంబర్ ఆధారంగా గోషామహల్ పోలీసులు జాహెర్ ఆచూకీ తెలుసుకున్నారు. ఈ విషయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ దృష్టికి తీసుకుని వెళ్లారు. వెంటనే ఆటోడ్రైవర్‌ను సిపి పిలిపించి సన్మానం చేశారు.

ఈ సందర్భంగా సిపి విసి సజ్జనర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్ అని కొనియాడారు. ఆయనలో అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారని, ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదని తెలిపారు. డబిర్‌పురాకు చెందిన రౌడీ షీటర్‌పై గోషా మహల్ పీఎస్ లో కేసు నమోదు చేసి, అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయని తెలిపారు. కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్ర మోహన్, గోషామహల్ ఇన్స్‌స్పెక్టర్ శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.