శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్లుగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే, సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో వి.వి. వినాయక్ మాట్లాడుతూ “మిస్టర్ మిడిల్ క్లాస్’ ట్రైలర్ చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ట్రైలర్ చూడగానే ఇది సూపర్ హిట్ అవుతుందనే ఫీలింగ్ కలిగింది”అని పేర్కొన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “వెంకటేశ్వర స్వామి పాత్ర లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. అలాంటి గొప్ప పాత్ర డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు రావడం అదృష్టం.

ఈ సినిమాలో ఆయన పాత్ర ఒక పెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్లు పడే కష్టాలను వినోదాత్మకంగా చెప్పడం ఒక గొప్ప కళ. ఆ విషయంలో నాగేశ్వర్ రెడ్డి అద్భుతంగా విజయం సాధించారు. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడికే చెప్పుకుంటాం. ఇలాంటి ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌లో నటించే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “మిస్టర్ మిడిల్ క్లాస్... పూర్తిగా ప్రేక్షకుల కోసం తీసిన సినిమా.

ఈ రోజుల్లో మనం మిడిల్ క్లాస్ వాళ్లమంతా ఎలాంటి సమస్య వచ్చినా వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిస్తాం. మన బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటాం. ఈ సినిమాలో కూడా వెంకటేశ్వర స్వామిని చాలా ఫ్రెండ్లీగా చూపించాం. ఆ పాత్ర ద్వారా రాజేంద్ర ప్రసాద్ మీ అందరికీ ఒక స్నేహితుడిలా అనిపిస్తాడు. ప్రేక్షకులందరూ ఈ పాత్రను ఎంతో ఎంజాయ్ చేస్తారని నేను గ్యారెంటీగా చెబుతున్నాను”అని తెలిపారు. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “పెళ్లి సందడి, వినోదం, ఎగిరే పావురమా, ఆమె వంటి శ్రీకాంత్ బ్లాక్‌బస్టర్ సినిమాలను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు రావాలి. శ్రీకాంత్ మరో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నారు. కుటుంబంలో ఉన్న ప్రతి భార్య లయ పాత్రను ఎంతో ఇష్టపడుతుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చందు, అలీ, అంజి, సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.