న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడానికి విధించిన గడువు ముగియడంతో ది జమ్ము కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెఎఎసి) ఉద్యమాన్ని తీవ్రం చేసింది. పీవోకే లోని ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వీలుగా నిత్యావసర వస్తువులపై రాయితీలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు గుర్తింపు తదితర 38 డిమాండ్లు నెరవేర్చాలని జేఏఏసీ కోరుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఆ నేతల అకృత్యాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది. రావల్‌కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు 40 వేల మంది నిరసనకారులు లాంగ్ మార్చ్ చేపట్టారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం 4 వేల మంది రేంజర్లు ( భద్రతా సిబ్బంది )ని వివిధ నగరాలు, పట్నాల్లో మోహరించింది. మీడియాను కూడా నిషేధించారు. భారీ స్థాయిలో రేంజర్లు, పోలీస్ బలగాలు మోహరించినా నిరసనలు ఆగలేదు. మంగళవారం జరిగిన నిరసనల్లో తలెత్తిన ఘర్షణల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతకాలంగా పీవోకేలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో దాదాపు 40 లక్షల మంది ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని నిరసనకారులు తెలిపారు.