
కాలం కలిసిరాక... ఒకవైపు వర్షాలు లేక... మరోవైపు నమ్ముకున్న విద్యుత్ సరఫరా సక్రమంగా లేక... దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ రైతు, వేలాది రూపాయలు ఖర్చు చేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా వరి నారుమడిని తడుపుకుంటూ తన పంటను కాపాడుకునేందుకు అల్లాడిపోతున్నాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం మురుమూరు పంచాయతీ ప్రగళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ధనపనేని విశ్వనాథ్ ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో సుమారు 15 ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం సకాలంలో వరి నారు పోశారు. అయితే, ప్రస్తుతం పగటిపూట త్రీఫేస్ కరెంటు సరైన సమయంలో సరఫరా కాకపోవడం ఈ ప్రాంత రైతులకు శాపంగా మారింది.
కాసేపు వస్తూ, పోతూ వరి నారు పోసే సమయానికి విద్యుత్ అంతరాయం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నారు ఎండిపోతే ఈ ఏడాది సాగు మొత్తం ఆగమైపోతుందని భయపడిన రైతు విశ్వనాథ్ చేసేదేమీ లేక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు.రూ. 1,500 చొప్పున భారీగా అద్దె చెల్లించి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్‌ను పొలానికి రప్పించారు. ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకొచ్చి వరి నారుమడికి తడుపుతూ నారును బతికించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ దృశ్యాలు స్థానికంగా అందరినీ కలచివేస్తున్నాయి.












