అమరావతి: రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రిపగలు కష్టపడుతున్నామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని పునర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని అన్నారు. పమిడిముక్కల ప్రజావేదిక ప్రాంగణంలో స్టాళ్లు పరిశీలించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ‘పేదల సేవ’ లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు పునర్ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చామని, పేదల రుణం తీర్చుకునేందుకు కష్టపడుతున్నామని తెలియజేశారు. టిడిపి గుర్తులో నాగలి, కార్మికుడు, గుడిసెను దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ ఉంచారని, శుభసూచకానికి గుర్తు పసుపు ఆ రంగును పార్టీ జెండాలో ఉంచారని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజల సంతోషాన్ని చూసి తన కష్టాన్నిమరచిపోతున్నానని, పింఛన్ల కోసం ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని అన్నారు. పింఛన్ల పంపిణీని భారంగా భావించట్లేదని, బాధ్యతగా భావిస్తున్నానని, దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వట్లేదని చెప్పారు. కార్మికుల కోసం లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడుతున్నామని, లేబర్ అడ్డాలు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా మారాలని అధికారులకు సూచించారు. అత్యాధునిక పనిముట్లతో తొలిదశలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని, తొలి దశలో లేబర్ అడ్దాలు విజయవంతమైతే మిగిలిన ప్రాంతాలకు విస్తరణ జరుగుతుందని, తానూ రైతు కుటుంబం నుంచే వచ్చానని రైతు కష్టం, విలువ తెలుసు అని అన్నారు.

రెండేళ్ల క్రితం నేతలు బయట తిరిగే పరిస్థితి లేదని, ప్రజలందరికీ మరో స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్ డిఎది అని కొనియాడారు. ఇకపై ప్రతి సమావేశంలో ఎమ్ఎల్ఎ పనితీరుపై ప్రజలనే అడుగుతానని, ఎమ్ఎల్ ఎ పనితీరు సరిగా లేకుంటే వారికి ఛాన్స్ ఉండదని అన్నారు. మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డికి మానసిక సమస్య ఉందని, వైసిపి పార్టీ కాదని, కోడికత్తి, గొడ్డలి పార్టీ అని దుయ్యబట్టారు. అవకాశం ఇస్తే నాశనం చేయడం ఆయనకు అలవాటు అని 2019లో అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చేశారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.