
ఖాట్మండూ: నేపాల్‌ను అతలాకుతులం చేసిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య శుక్రవారం 1,295కు పెరింది. ఈ విపత్తు సంభవించిన తొమ్మిది రోజుల తర్వాత రసూవా జిల్లాలోని త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద సొరంగం నుంచి భద్రతా బలగాలు ఇద్దరిని సజీవంగా రక్షించాయి. వీరిని జలవిద్యుత్ ప్రాజెక్టులో మెకానికల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల కబీర్ మహార్జన్, ఫోర్‌మన్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల సంజయ్ సాహ్‌గా గుర్తించినట్టు నేపాల్ ఆర్మీ పబ్లిక్ రిలేషన డైరెక్టరేట్ వెల్లడించింది. మహార్జన్‌ను ఖాట్మండూలోని ఛౌని నేపాల్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సాహ్‌కు నువాకోట్‌లోని త్రిశూలీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
హరేకృష్ణ మంత్రం జపిస్తూ
మదేశ్ ప్రావిన్స్‌లోని సప్తరీ జిల్లాకు చెందిన సాహ్ గత తొమ్మిది రోజుగా తాను హరేకృష్ణ మంత్రాన్ని జపిస్తూ గడిపినట్టు భధ్రతా సిబ్బందికి తెలిపారు. ఖాట్మండుకు చెందిన మహార్జన్ భార్య హీరా శోభ మాట్లాడుతూ, తన భర్తకు ‘రెండో జన్మ’ లభించిందని సంతోషం వ్యక్తం చేసింది. ప్రాణాలకు తెగించి తన భర్తను రక్షించిన సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. తన భర్తను చూడటానికి ఆసుపత్రికి వెళ్తున్నానని ఆమె చెప్పినట్టు ‘ఖాట్మండూ పోస్ట్’ పేర్కొంది.











