మనతెలంగాణ/హైదరాబాద్: సమ్మక్క సారక్క బ్యారేజీ ప్రా జెక్టుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం త్వరగా ఎన్‌ఓసీ జారీ చేయాల ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కోరారు. ఎన్‌ఓసీ జారీ చేస్తే ప్రాజెక్టు ముం పు బాధితులకు పూర్తి పరిహారం చెల్లిస్తామని అవసరమైతే పరిహార నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్ధమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ముఖ్యమంత్రితో సమావేశమైన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బ్యారేజీలో పూర్తి స్థాయి నీటిమట్టం వరకు నీటిని నిల్వ చేసి, నిర్దేశిత సాగునీటి ప్రయోజనాలను రైతులకు అందించేందుకు ఛత్తీస్‌గఢ్ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు పెండింగ్ అంశాలను పరిష్కరించుకునేందుకు పొరుగు రాష్ట్రంతో కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో 2025 సెప్టెంబర్ 22వ తేదీన రాయపూర్‌లో, 2026 జూన్ 11వ తేదీన హైదరాబాద్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో ఎన్‌ఓసీ అంశంపై చర్చించగా తాజాగా మరోసారి ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.

గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మాణం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై ప్రాజెక్టును నిర్మించారు. దీనిపొడవు 1,143 మీటర్లు కాగా 59 రేడియల్ గేట్లు ఉన్నాయి. దీనీ పూర్తి స్థాయి నీటిమట్టం +83 మీటర్ల వద్ద దీని రూపకల్పన నిల్వ సామర్థ్యం 6.94 టిఎంసీలు. సాగునీటి అవసరాల కోసం గోదావరి నుంచి 46.96 టిఎంసీల నీటిని మళ్లీంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద సూర్యాపేట 2,34,199 ఎకరాలు, మహబూబాబాద్ 96,494 ఎకరాలు, ఖమ్మం 85,774 ఎకరాలు, వరంగల్ 22,422 ఎకరాలు, జనగామ 1,111 ఎకరాలకు నీరు అందించాలని ప్రతిపాదించారు.

రామప్ప-పాకాల కాలువ కింద

ఇక రామప్ప-పాకాల కాలువ కింద ములుగు జిల్లాలో 8 వేల ఎకరాలు, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో 22 వేల ఎకరాల కొత్త ఆయకట్టు కూడా ఉంది. బ్యాక్‌వాటర్ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ. 988.30 లక్షలు ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జలవనరుల శాఖకు 2026 ఏప్రిల్ 29న చెల్లించింది. డిజిపిఎస్ సర్వేలు పూర్తయ్యాయి. లైడార్ డ్రోన్ సర్వేలు, క్షేత్రస్థాయి సమాచారం సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది.