
మన తెలంగాణ/హైదరాబాద్: ప్లాట్లు, భూముల వేలానికి హెచ్‌ఎండిఏ సిద్ధమైంది. ఈ సారి రూ.2,500కోట్ల ఆదాయమే లక్ష్యంగా హె చ్‌ఎండిఏ వేలానికి సిద్ధమైంది. మొత్తం 168 ప్లాట్లు, 8.24ఎకరాల భూముల వేలం వేయాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. దీనికి సం బంధించిన నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేసింది. కోకాపేట్‌లోని నియోపొలీస్ లేఔట్‌లోని ప్లాట్ల వేలంతో రూ.3,800 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకున్న హెచ్‌ఎండిఏ ఈసారి కూడా భారీగా ఆదాయాన్ని రాబట్టాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
మోకిల లే ఔట్‌లోని 100 ప్లాట్లకు వేలం
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిల లే ఔట్ లోని 100 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు. ఈ లే ఔట్‌లో ప్లాట్ కనిష్ట విస్తీర్ణం 300 చదరపు గజాలు, గరిష్ట విస్తీర్ణం 500 చదరపు గజాలు గా ఉంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మేడిపల్లి లే ఔట్ లో 68 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో ప్లాట్ కనిష్ట విస్తీర్ణం 231 చదరపు గజాలు, గరిష్ట విస్తీర్ణం 643 చదరపు గజాల్లో ఉన్నాయి. దీంతోపాటు హైదరాబాద్ జిల్లా షేక్ పేట్ మండలంలోని హాకీంపేటలో 8.24 ఎకరాల భూమి సైతం వేలం వేయనున్నారు. లే ఔట్‌లోని ప్లాట్లతోపాటు ఆ యా ప్రాంతాల్లోని ల్యాండ్ పార్శిళ్లకు సైతం వేలం నిర్వహించనున్నా రు. శేరిలింగంపల్లి మండలంలోని చందానగర్ సర్వే నెంబర్ 174 లోని 484 చదరపు గజాల భూమి, గండిపేట మండలం బైరాగిగూడలోని సర్వే నెంబర్ 57లోని 2,420 చదరపు గజాల భూమి, నార్సింగి ప్రాంతంలోని సర్వే నెంబర్ 105లో ఉన్న 5,687 చదరపు గజాల భూమి పార్శిళ్లు ఉన్నాయి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గండిమైసమ్మ మండలం భౌరంపేట గ్రామంలోని సర్వే నంబర్ 694లో ఉన్న 2,420 చదరపు గజాల భూమి, కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం గ్రామంలోని సర్వే నెంబర్ 166, 167లో ఉన్న 4,840 చదరపు గజాల భూమి, మేడిపల్లి మండలంలోని ఫీర్జాదిగూడలోని సర్వే నెంబర్ 199లో ఉన్న 2,057 చదరపు గజాల భూమి, 726 చదరపు గజాల భూమి పార్శిళ్లకు వేలం వేయనున్నారు. మోకిలా లే ఔట్‌లోని 100 ప్లాట్లు, మేడిపల్లి లే ఔట్‌లోని 68 ప్లాట్ల విక్రయం ద్వారా రూ.400 కోట్లు, హాకీంపేటలోని 8.24 ఎకరాల విక్రయం ద్వారా రూ.1,600 కోట్ల ఆదాయం వస్తుందని హెచ్‌ఎండిఏ అధికారులు అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లాలోని భూముల పార్శిళ్ల విక్రయం ద్వారా రూ.500 కోట్ల ఆదాయంతో మొత్తం రూ.2,500కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
షెడ్యూల్ ఇలా..
ప్లాట్లు, భూముల వేలానికి సంబంధించిన షెడ్యూల్‌ను హెచ్‌ఎండిఏ జారీ చేసింది. ఆయా భూమి పార్శిళ్లకు జూన్ 15 రిజిస్ట్రేషన్‌తో పాటు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. 17వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు వేలం నిర్వహించనున్నారు. హకీంపేట్ భూమికి జూన్ 17వ తేదీన రిజిస్ట్రేషన్, 19వ తేదీన వేలం, మేడిపల్లి లే ఔట్‌లోని 68 ప్లాట్లకు 22వ తేదీ రిజిస్ట్రేషన్, 24వ తేదీన వేలం, మోకిల లే ఔట్‌కు 27వ తేదీన రిజిస్ట్రేషన్, 29వ తేదీన వేలం వేయనున్నారు.











