
ప్రతిష్టాత్మకంగా జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, మొత్తం అయిదు అసెంబ్లీల ఎన్నికల పోలింగ్ ఘట్టం బుధవారంతో ముగిసింది. రెండు చోట్ల ఎన్‌డిఎ, మూడు చోట్ల ప్రత్యర్థి పార్టీ/ కూటములు గెలుపొందే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దేశప్రజల దృష్టినాకర్శించిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా ప్రస్తుత ముఖ్యమంత్రులు తమ ప్రభుత్వాల్ని నిలబెట్టుకునే సూచనలున్నాయి. ఈ రెండు చోట్ల, కేంద్రంలో పాలకపక్షమైన బిజెపికి గట్టి ప్రత్యర్థులు మమతా బెనర్జీ (టిఎంసి), ఎం.కె. స్టాలిన్ (డిఎంకె) లు ముఖ్యమంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే! ఇక బిజెపి నేతృత్వం వహిస్తున్న ఎన్‌డిఎ ప్రస్తుత పాలనలోని అసోం (హిమంత బిశ్వశర్మ), పుదుచ్చెరి (ఎన్.ఆర్. రంగస్వామి) ల్లోనూ పాలకపక్షాలే గెలుపొందనున్నాయి. దేశంలో ఏకైక కమ్యూనిస్టు రాష్ట్రం కేరళ (పినరయ్ విజయ్) లో మాత్రమే పాలక వామపక్ష ఎల్‌డిఎఫ్ ఓడి కాంగ్రెస్ నేతృత్వపు యుడిఎఫ్ గెలుపొందే సంకేతాలున్నాయి. ఇక్కడ బిజెపి ఉనికి నామమాత్రమే! ఇదీ అసెంబ్లీల ఎన్నికల తాజా ముఖచిత్రం!
కమ్యూనిస్టు పాలనలోని ఒక్క కేరళలో తప్ప మిగతా నాలుగుచోట్ల పాలకపక్షాలే ఎన్నికల్లో గెలిచే సూచనలున్నాయి. అందులో రెండు ఎన్‌డిఎ ప్రభుత్వాలయితే రెండు ప్రత్యర్థి ప్రభుత్వాలు. అంటే, ఎన్నికలు జరిగిన అసెంబ్లీలు అయిదింట రెండు ఎన్‌డిఎకు, మూడు ఇతరులకు దక్కనున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) వివాదమొకవైపు, నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్‌తో ముడిపెట్టిన రాజ్యాంగ సవరణ పంచాయతీ మరోవైపు రేపిన ఉత్కంఠ మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ రికార్డు స్థాయిలో నాలుగోసారి ముఖ్యమంత్రి కానున్నారు. అసోంలో బిజెపి వరుసగా మూడో మారు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తన తండ్రి కరుణానిధి సాధించలేని రికార్డు, తమిళనాడులో వరుసగా రెండోసారి డిఎంకెను గెలిపించి ఎం.కె. స్టాలిన్ నెలకొల్పనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరిలో సిఎం ఎన్.ఆర్. రంగస్వామి నేతృత్వంలో మళ్లీ ఎన్‌డిఎ అధికారం కైవసం చేసుకోనుంది. ప్రతిసారీ కొత్త ప్రభుత్వాన్నే ఎన్నుకునే కేరళ సాంప్రదాయానికి భిన్నంగా 2021లో వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పరచి రికార్డు సృష్టించిన సిఎం పినరయ్ విజయ్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ఈసారి గట్టెక్కే పరిస్థితులు లేవు. వాయ్‌నాడ్ లోక్‌సభ స్థానంవల్ల కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకల ప్రాబల్యం పెరిగిన కేరళలో ఈసారి సమీకరణాలు యుడిఎఫ్‌కు ప్రభుత్వం ఏర్పర్చే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయిదు చోట్ల ‘పీపుల్స్‌పల్స్’ జరిపిన సర్వేలో వెల్లడయిన అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మమతకే మళ్లీ పట్టం!
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) అత్యంత వివాదాస్పదమైన రాష్ట్రం పశ్చిమబెంగాల్. ఈసారి ఎన్నికల ప్రచారాలు ఆద్యంతం ‘సర్’ చుట్టూ అల్లుకున్న పరిస్థితుల్లో ఫలితంపై ఉత్కంఠ, దేశ ప్రజల ఆసక్తి తారస్థాయికి చేరాయి. ‘ఈసారి మమత ఓటమి ఖాయమని బిజెపి వర్గాలు బలంగా విశ్వసిస్తున్న చోట, ఫలితం అందుకు భిన్నంగా ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ‘సర్’ను వ్యతిరేకిస్తూ మమత తన కేసు తానే సుప్రీం కోర్టులో వాదించి సంచలనం సృష్టించారు. ఆమె ఎన్నికల వ్యూహకర్త ‘పికె టీం’ పై ఇడి దాడులు, కేంద్ర బలగాల మోహరింపుతో సహా కేంద్ర సర్కారు ఈ పోరులో ఎన్నో ఎత్తుగడలు పన్నింది. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), బిజెపిలకు లభించిన ఓట్ల మధ్య వ్యత్యాసం 60 లక్షలు కాగా ఈసారి ‘సర్’లో తొలగించిన ఓట్లే 90 లక్షలు! కిందటి ఎన్నికలతో పాలిస్తే టిఎంసి (215) స్థానాలు తగ్గి బిజెపి స్థానాలు (77) పెరిగే అవకాశముంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా ఇతరులంతా నామమాత్రమైపోయిన ఇక్కడ, ఈ రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు ముదిరింది. ఇరు పార్టీల మధ్య ఓటు వాటా వ్యత్యాసం, గత ఎన్నికల్లో నమోదైన 10 నుంచి ఈసారి 5 శాతానికి తగ్గనుంది. మళ్లీ గెలిస్తే మమత నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. 294 స్థానాలున్న బెంగాల్‌లో మ్యాజిక్ నంబర్ 148. టిఎంసి 46.5 శాతం ఓటు వాటాతో 177- 187 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. బిజెపి 41.5% ఓటు వాటాతో 95 -110 స్థానాలు గెలవొచ్చు. కాంగ్రెస్‌కి 2.1 శాతం ఓటు వాటతో 1-3 స్థానాలు, వామపక్షాలు 4.1శాతం ఓట్లతో 0-1, బిజిపిఎం పార్టీ 0.7శాతం ఓట్లతో 1- 2 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.
విజయ్ ఫ్యాక్టరే కీలకం!
ద్రవిడ పార్టీల రాజ్యం తమిళనాడులో మరో సినీ కెరటం మొలిచి, బరిలో నిలవడం ఈసారి ఎన్నికల విశేషం! సినీతార విజయ్ నెలకొల్పిన తమిళగ వెట్రి కజగం (టివికె) అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నా ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించదు. సీట్ల కన్నా వారు చీల్చే ఓటు ఎవరిది? అన్నదే ప్రధాన ప్రత్యర్థులైన లౌకిక ప్రగతిశీల కూటమి (ఎస్‌పిఎ), జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) గెలుపోటముల్ని నిర్ణయించనుంది. అధికార డిఎంకె-కాంగ్రెస్ (ఎస్‌పిఎ) కూటమి సానుకూల వాతావరణానికి, సిఎం స్టాలిన్‌పై ప్రజాక్షేత్రంలో గట్టి వ్యతిరేకత లేకపోవడం ఓ కారణం. వనరులు, నిర్వహణ, నెట్‌వర్క్, పొత్తుల్లో సయోధ్య పరంగా ఈ కూటమే ప్రత్యర్థి ఎఐడిఎంకె బిజెపి కూటమి (ఎన్‌డిఎ) కన్నా బలంగా కనిపిస్తోంది. నిధుల్లో వివక్ష, గవర్నర్ ద్వారా దొడ్డిదారి రాజకీయాలు, పునర్విభజనతో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించే యత్నం... ఇట్లాంటి పలు విషయాల్ని తెరమీదకు తెచ్చి ఎన్నికల పోరుని ఢిల్లీ పెత్తనం వర్సెస్ తమిళ గౌరవంగా స్టాలిన్ మలిచారు. 234 స్థానాలున్న తమిళనాడులో మ్యాజిక్ నంబర్ 118. డిఎంకె నేతృత్వపు కూటమి 38.4 శాతం ఓటు వాటాతో 125 -145 స్థానాలు గెలిచే అవకాశముంది. ఎఐఎడిఎంకె కూటమి 31.5 శాతం ఓటు వాటాతో 65- 80 సీట్లు గెలిచే ఆస్కారముంది. ఓట్లను గణనీయంగా చీల్చే అవకాశమున్న టివికే తనకు తానుగా 21.8 శాతం ఓటు వాటాతో 18 -24 స్థానాలు గెలుచుకోవచ్చు.
అసోంలో మళ్లీ బిజెపి జెండా!
కూటమి భాగస్వాములతో నిమిత్తం లేకుండా బిజెపి సొంతంగానే అసోంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదగ్గ స్థాయిలో మెరుగుపడింది. ఈసారి గెలిస్తే బిజెపి వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకున్నట్టవుతుంది. కాంగ్రెస్ కూడా లోగడ వరుసగా మూడు పర్యాయాలు ప్రభుత్వాలను ఏర్పరచినప్పటికీ 2014 తర్వాత బలహీనపడుతూ వచ్చింది. సిఎం హిమంత బిశ్వశర్మ అసోంతోపాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి బలపడేలా వ్యూహరచన చేస్తూ సానుకూల ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతనిస్తారు అని అడిగినపుడు అత్యధికంగా 45 శాతం మంది అస్సామీలు బిశ్వశర్మవైపు మొగ్గారు. రాష్ట్రంలో ఆయనకు ప్రత్యర్థి, మూడు మార్లు ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ తనయుడు గౌరవ్ గగోయ్‌కు 35 శాతం మద్దతు లభించింది. స్థూలంగా ఎన్‌డిఎ అయినప్పటికీ, స్థానిక పార్టీలు ఎజిపి, బిపిఎఫ్ లతో కలిసి బిజెపి ఏర్పరచిన ‘ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి’ (ఎన్‌ఇడీఎ) పొత్తులు బాగా కుదిరాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని ‘అసోమ్ సోన్‌మిలిటో మోర్చా’ (ఏఎస్సెమ్) లో ఐక్యత కడదాకా కష్టమైంది. ఆయా కూటముల మధ్య ఓటు వాటాల్లో వ్యత్యాసం తక్కువగా ఉన్నప్పటికీ, ఎన్‌ఇడిఎ కూటమికే సానుకూలత ఎక్కువగా కనిపించింది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నంబర్ 64. బిజెపి నేతృత్వపు ఎన్‌ఇడిఎ కూటమి 38.6% ఓటు వాటాతో 83- 91 స్థానాలు నెగ్గే అవకాశముంది. బిజెపి సొంతంగా 68- 72 స్థానాలు గెలవొచ్చు. ప్రత్యర్థి ఎఎస్సెమ్ కూటమి 36.5% ఓటు వాటాతో 23- 31 స్థానాల్లో గెలుపొందవచ్చు.
కమ్యూనిస్టులకు గడ్డుకాలం
కేరళలో దశాబ్దాల ఆనవాయితీకి విరుద్ధంగా వరుసగా రెండోసారి ప్రభుత్వం (2021) ఏర్పాటు చేసిన కమ్యూనిస్టు కూటమి (ఎల్‌డిఎఫ్) ఈసారి ఓటమినెదుర్కొనే సంకేతాలు వెలువడుతున్నాయి. గెలిస్తే రికార్డవుతుంది. కానీ, 2021 తర్వాత జరిగిన లోక్‌సభ (2024), స్థానికసంస్థలు, అసెంబ్లీ ఉపపోరు ఇలా అన్ని ఎన్నికల్లోనూ వారికి ఓటమి తప్పలేదు. మున్నెన్నడూ లేనంతగా ప్రస్తుత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వరుస మూడు ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఆధిపత్యమున్న రిజర్వుడు స్థానాల్లో వెనుకంజ, పట్టణ ప్రాంతాల్లో కొన్ని ఇతర పాకెట్లలో బిజెపి విస్తరణ, రెండు పర్యాయాల ఓటమి తర్వాత కాంగ్రెస్ పుంజుకోవడం వంటివి ఎల్‌డిఎఫ్ అవకాశాలను బాగా దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రంలోని ఉపకులాలలో వచ్చిన చీలికలు కూడా కమ్యూనిస్టుల్ని కొన్ని జిల్లాల్లో బలహీనపరిచాయి. అదే సమయంలో ఇవే అంశాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌కు అనుకూలించడం కారణంగా ఆ కూటమి గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటముల మధ్య ఓటు వాటాల వ్యత్యాసం స్వల్పంగానే ఉన్నప్పటికీ సీట్ల విషయంలో తేడా విస్పష్టంగానే ఉండే సూచనలున్నాయి. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో అధికారానికి రావటానికి అవసమయ్యే మ్యాజిక్ నంబర్ 71. విపక్ష యుడిఎఫ్‌కు 75 -85 స్థానాలు లభించే అవకాశముంది. పాలక ఎల్‌డిఎఫ్ 55- 65 స్థానాలకు పరిమితం కావచ్చు. బిజెపి రెండు, మూడు స్థానాలు రావొచ్చు.
సిఎం లీడింగ్
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చెరి అసెంబ్లీ ఎన్నికల్లో పలు ప్రతికూలతల మధ్య కూడా ఎన్‌డిఎ భాగస్వామ్యమే ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ నుంచి విడిపోయి, ఎన్.ఆర్ కాంగ్రెస్ నెలకొల్పి, దాన్ని కిందటి ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా గెలిపించి, బిజెపి మద్దతుతో ఎన్.ఆర్. రంగస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ ఎన్‌డిఎ కూటమి గెలుపు ద్వారా ఆయనే తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. తమిళనాడు పక్కలో, భౌగోళికంగా మూడుముక్కలై ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంతంలో తమిళ రాజకీయాల ప్రభావం ఎక్కువ. సినీతార విజయ్ (టివికె) ప్రభావం వల్ల ఓట్లలో చీలిక ముఖ్యాంశం కానుంది. డిఎంకె - కాంగ్రెస్‌ల ఎస్‌పిఎ కూటమి ఈసారి తన పరిస్థితిని మెరుగుపరచుకోనుంది. అయినా, పాలక ఎన్‌డిఎ కూటమి సుమారు 4 శాతం ఓట్ల వాటా వ్యత్యాసంతో తన ఆధిక్యతను కొనసాగించే సూచనలున్నాయి. హంగూ, ఆర్భాటం లేకుండా సామాన్యుడిలా జనంలో కలిసిపోయే రంగస్వామికి మంచి పేరే ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్‌తో సిఎంకు విభేదాలతో విసిగిపోయి ఉన్నారు. రాష్ట్ర హోదాపై ఆశలున్నాయి. 30 స్థానాలున్నా పుదుచ్చెరి అసెంబ్లీలో అధికారానికి అవసరమైన మ్యాజిక్ నంబర్ 16. మూడు నామినేటెడ్ ఎంఎల్‌ఎ పదవులున్నాయి. ఎన్‌ఆర్ కాంగ్రెస్ 10-12 స్థానాలతో అతిపెద్ద పార్టీగాను, బిజెపి గెలిచే 5- 6 తో కలిపి ఎన్‌డిఎ 16- 19 స్థానాలతో విజయకూటమిగా అవతరించే అవకాశాలున్నాయి. విపక్ష ఎస్‌పిఎకు 10-12 స్థానాలు గెలవొచ్చు. ఒకటి, రెండు స్థానాలు ఇతరులకు దక్కొచ్చు.
దిలీప్‌రెడ్డి













