నేపాల్‌లోని రోల్పా జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భక్తులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ జీపు కొండ ప్రాంతంలో అదుపు తప్పి సుమారు 800 మీటర్ల లోతు ఉన్న లోయలోకి పడిపోయింది.ఈ దుర్ఘటన రోల్పా జిల్లాలోని థవాంగ్ రూరల్ మునిసిపాలిటీ పరిధిలోని జల్‌జలా అనే ప్రాంతంలో జరిగింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా జల్‌జలాలోని ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారి బురదమయంగా మారడంతో వాహనం అదుపు తప్పి జారిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మృతదేహాల వెలికితీత, సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని పోలీసులు తెలిపారు.