టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తదుపరి మూవీ అప్‌డేట్ వచ్చేసింది. విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివతో బాలకృష్ణ తదుపరి చిత్రంలో నటించనున్నారు. ‘ఎన్‌బికె112’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కొరటాల శివ మార్క్ సామాజిక సందేశంతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.

‘‘అధికారానికి ఉద్దేశం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది’’ అనే పవర్‌ఫుల్ కొటేషన్‌‌తో ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఎన్‌బికె111’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారని టాక్. ‘వీరసింహారెడ్డి’ వంటి పవర్‌ఫుల్ సినిమా తర్వాత బాలకృష్ణ, గోపిచంద్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.