
గ్రామీణ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తే రైతులకు మేలు జరుగుతుందని, వినియోగదారునికి నాణ్యమైన వస్తువు, మహిళా సంఘాలకు ఆదాయం లభిస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయం వేదికగా రాష్ట్రంలో నిర్మిస్తున్న 8 వేల ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
మహిళలను ఆర్థికంగా నిలబెట్టే దిశగా ఇది చారిత్రక కార్యక్రమమని సిఎం అన్నారు. ఈ సందర్భంగా చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరల నాలుగు కొత్త డిజైన్లను కూడా సిఎం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె లాగా ఇందిరమ్మ చీరలు అందజేస్తోందని సిఎం పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన చీరలు నాణ్యత లేక పంట పొలాల్లో పిట్టలను తరిమేందుకు ఉపయోగించారన్న విమర్శలు వచ్చాయని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని, ఈసారి చిలుకపచ్చ రంగులో కొత్త డిజైన్ చీరలు ఇవ్వబోతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.











