మన తెలంగాణ/హైదరాబాద్‌ః గత కొంత కాలంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య రగులుతున్న వివాదం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ చెంతకు చేరింది. మంగళవారం ఆమె ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖతో, లోక్‌సభ సభ్యురాలు కడియం కావ్యతో వేర్వేరుగా మంతనాలు జరిపారు. తొలుత మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆమెతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అయితే తాను స్వయంగా వచ్చి కలుస్తానని మంత్రి కొండా సురేఖ చెప్పి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకుని మీనాక్షితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేయగా, సంయమనం పాటించాలని మీనాక్షి నటరాజన్ ఆమెకు సూచించారు. చిన్న విషయాలను పట్టించుకోవద్దని మీనాక్షి చెప్పగా, మంత్రి కొండా సురేఖ సంతృప్తి చెందలేదని తెలిసింది. తన ఆత్మగౌరవం దెబ్బతినేలా ఎమ్మెల్యే కడియం ప్రవర్తిస్తుంటే తాను ఎలా మౌనంగా ఉండాలని ఆమె అన్నట్లు సమాచారం. తాను కడియంతో కూడా చర్చించి పరిష్కరిస్తానని మీనాక్షి మంత్రి కొండా సురేఖకు చెప్పారు. కాగా ఇటీవల దేవాదాయ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీహరి నిబంధనలకు విరుద్ధంగా సమీక్షా సమావేశం నిర్వహించడాన్ని ఆమె తప్పుపడుతూ ఫిర్యాదు చేశారు. జిల్లాలోనూ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారని తెలిసింది.

ఇదిలాఉండగా అంతకు ముందు లోక్‌సభ సభ్యురాలు కడియం కావ్య (కడియం శ్రీహరి కుమార్తె) కూడా మీనాక్షి నటరాజన్‌తో సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య చాలా కాలంగా ఎందుకు విభేదాలు వస్తున్నాయి? వీటిని పరిష్కరించకపోతే పార్టీకి నష్టం కదా? ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కదా? అని మీనాక్షి నటరాజన్ ఎంపీ కావ్యతో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎంపీ కావ్య కూడా జిల్లాలో జరుగుతున్న రాజకీయాల గురించి వివరించినట్లు సమాచారం.

సచిన్‌తో చర్చించిన మీనాక్షి

కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ఇదివరకే ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్‌ను ఆమె నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సచివన్‌తోనూ కొంత సేపు చర్చించారు. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని సచిన్ సావంత్ మీనాక్షి నటరాజన్‌కి వివరించారు.