
హైదరాబాద్: ఎన్నికలు అయిపోగానే సిలిండర్, పెట్రోల్ ధరలు పెంచడం ప్రధాని నరేంద్ర మోడీకి అలవాటు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. హోటల్ కార్మికులకు ప్రధాని ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇది అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 80 ఏళ్లల్లో ఎప్పుడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచారని, రూపాయి విలువ పాతాళానికి, సిలిండర్ ధరలు ఆకాశానికి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని, సిగాచి ఫ్యాక్టరీలో కార్మికులు చనిపోతే ఇప్పటి వరకు పరిహారం లేదని విమర్శించారు.
ఎన్నికల ముందు దాన వీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ అని ఎద్దేవా చేశారు. జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అని కెటిఆర్ ప్రశ్నించారు. హామీలపై అడిగితే బూతులు తిడుతారని, కార్మికులు అంటే సిఎం రేవంత్ రెడ్డికి లెక్కలేదని మండిపడ్డారు. హోటల్ కార్మికుల నడ్డి విరిచేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని, తాను ఎంతో మంది సిఎం లను చూశానని, ఆ సిఎంలకు రేవంత్ కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని దుయ్యబట్టారు. కరోనా సమయంలో కార్మికులను అప్పటి మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఆదుకుందని కెటిఆర్ పేర్కొన్నారు.












