
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని ర కాలుగా మోసం చేసిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నా రు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగు సంవత్సరాల కిందట అనే క హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెం డేళ్లు దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తన మోసాన్ని కొనసాగిస్తున్నదని విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతన్నలను మోసం చేసిన మే 6వ తేదీన కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేలా రైతన్నలతో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ సమావేశానికి కెటిఆర్‌ను ఆహ్వానించగా, తాను హాజరవుతానని కెటిఆర్ తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంగళవారం కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత, విత్తనాల కొరత ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలో తిరిగి ప్రారంభమయ్యాయని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతాంగానికి బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాలకు సిద్ధమవ్వాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగక రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని పార్టీ నేతలు కెటిఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ నేతలు కెటిఆర్‌కు పలు వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు వంటి సంస్థాగత అంశాలపై కెటిఆర్ కీలక సూచనలు ఇచ్చారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. దీంతోపాటు ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాలని, ప్రతి బూత్‌లో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని కెటిఆర్ పార్టీ నేతలకు సూచించారు. ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వినియోగించుకొని కొత్త ఓటర్లను నమోదు చేయించడంతోపాటు ఏ ఒక్క వ్యక్తికి ఓటు హక్కు కోల్పోకుండా చూసే బాధ్యత తీసుకోవాలని పార్టీ నేతలను కోరారు. ఇందుకు సంబంధించి బూత్ లెవెల్ సహాయకుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.












