
న్యూఢిల్లీ: దేశంలో శనివారం వాణిజ్య సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల సిలిండర్ ధరను అమాంతంగా, ఇంతకు ముందెప్పుడూ లేనంతగా రూ.993 వరకూ పెంచారు. దీనితో ఈ సిలిండర్ల వాడకం దార్లు అయిన హోటల్స్, హాస్టల్స్ ఇతర సంస్థలపై తీవ్ర ప్రభావం పడనుంది. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో క్రూడాయిల్ ,గ్యాస్ సరఫరా కటకటతో ధరలు పెంచాల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపా యి. కమర్షియల్ సిలిండర్లపై ఇది వరుసగా మూ డో నెలవారి పెరుగుదల అయింది. పెరిగిన ధరల మేరకు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఈ కమర్షియల్ సిలిండర్ ధర ఇకపై రూ.3071.5 అ య్యింది. ఇంతకు ముందు ఇది రూ.2078.50 గా ఉంది. ఇంతకు ముందు మార్చి 1వ తేదీన ఈ సిలిండర్ల ధరలను రూ 114.5 వరకూ పెంచారు. ఇప్పుడు ఇది రూ 900 దాటి పోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.
గల్ఫ్ సంక్షోభం నాటి నుం చి మూడుసార్లు పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ 1303 వరకూ అదనపు భారం పడింది. క్రూడాయిల్ ధరలు, గ్యాస్ ధర పెరిగినప్పటికీ దేశంలో వంటింటి గ్యాస్ ఎల్‌పిజి ధరలు పెంచలేదు. మార్చి 7వ తేదీన గ్యాస్ సిలిండర్ ధర రూ 60 చొప్పున (14.2 కిలోల పరిణామానికి) పెరిగింది. ఇప్పుడు వంటగ్యాసు సిలిండర్ ధర కొంచెం అటూ ఇటుగా దేశ వ్యాప్తంగా రూ 913 వరకూ ఉంది. ఈ ధరల జోలికి ఈసారి వెళ్లలేదు. ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి ప్రతినెలా 1వ తేదీన ధరలను సవరించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇటీవల వీటి ధరలు పెరుగుతూ పోతున్నాయి.










