
హైదరాబాద్: బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు కెసిఆర్ తెలిపారు. బిఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని అన్నారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇది చిల్లర ప్రభుత్వం.. ఆ మాటలు ఏంటి? తెలంగాణ గురించి ఎంపి తేజస్వీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తేజస్వీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బిజెపి ఎంపిలు ఒక్కమాట మాట్లాడలేదు. బిఆర్ఎస్ ఎంపిలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు. కాళేశ్వరంపై రాజ్యసభలో సిఆర్ పాటిల్ మాట్లాడితే.. సురేష్ రెడ్డి గట్టిగా ఖండించారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్, బిజెపి నేతలు ఏం చేస్తున్నారు.? నన్ను ఎన్నోసార్లు, ఎంతో మంది మానసిక క్షోభకు గురి చేశారు. హైదరాబాద్ విషయంలో రాజీపడాలని సోనియాగాంధీ ఎన్నోసార్లు చెప్పారు. అయినా కూడా నేను రాజీపడలేదు.. అది నా చిత్తశుద్ధి’’ అని కెసిఆర్ అన్నారు.











