టొరంటో: ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఘనా టీమ్ బోణీ కొట్టింది. గ్రూప్‌ఎల్‌లో భాగంగా పనామాతో జరిగిన మ్యాచ్‌లో ఘనా 10 గోల్ తేడాతో జయభేరి మోగించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఘనా చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. తనకంటే మెరుగైన జట్టుపై ఘనా ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువే. దూకుడైన ఆటతో ఘనా ఈ మ్యాచ్‌లో కనువిందు చేసింది. ఒకే ఒక గోల్ నమోదైనా ఈ మ్యాచ్‌లో ఘనా ఆట అద్వితీయంగా సాగింది. బలోపేతమైన పనామా జట్టును నిలువరించిన తీరును ప్రశంసించక తప్పదు. ఆరంభం నుంచే రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమైంది. ద్వితీయార్ధంలో కూడా ఇదే పరిస్థితి. నిర్ణీత సమయంలో ఇరు జట్లకు గోల్ దక్కలేదు. కానీ ఇంజ్యూరి టైమ్‌లో కలెబ్ ఘనా తరఫున చారిత్రక గోల్ సాధించాడు. దీంతో పనామాకు అనూహ్య ఓటమి తప్పలేదు.