
హైదరాబాద్: దెబ్బమీద దెబ్బ తగిలితే పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం రావడం సహజమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు బిఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతుల గురించి సిఎం రేవంత్‌రెడ్డి స్పీచ్‌లు, డైలాగ్‌లు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే ‘రైతు భరోసా’ను వాయిదాలుగా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.
‘‘ఎవరు వచ్చినా రైతు బంధు ఆగదని గతంలో కొందరు మాట్లాడారు. ఇవాళ రైతు బంధు నిధులు సరిగ్గా ఎందుకు కావట్లే? యూరియా ఎందుకు దొరకట్లేదు? గత పభుత్వంలో తప్పులేమీ జరగలేదని నేను అడవనడం లేదు. ఓటమి తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఎంపి సీట్లు గెలవలేకపోయాం. కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎస్సి, ఎస్టిలకు ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మోసం చేసింది. వైఎస్‌ఆర్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని మేం కొనసాగించాం. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు’’ అని కెటిఆర్ విమర్శించారు.












