
పేదోనిదైనా, పెద్దోనిదైనా... పైసలున్నోనిదైనా, పైసక్కరువున్నోనిదైనా... పూర్ గుడిసోనిదైనా, ఫుల్లు రిచ్చోనిదైనా... గూడున్నోడిదైనా, గూడు లేనోడిదైనా... ఎవరిదైనా పానమే. అది ఎప్పటికైనా పోయేదే గనీ, ఎల్లకాలం ఉండేది కాదు గదా..? మరి, అసొంటప్పుడు పానం బోయిన మనిషిని జూస్తే ఎందుకంత భయం? కాదు కాదు, అది భయమనుకుంటే మనం భ్రమ పడ్డట్ట్టే! ఆ పానంబోయిన మనిషి పెద్దోడు కాదు కావట్టే ఛీ పొమ్మంటున్నదీ పాడు లోకం. ఆ పానం బోయిన మనిషి దగ్గర పైసల్లెవ్వు కావట్టే అట్లా దూరం పెడుతున్నదీ సమాజం. ఆ పానం బోయిన మనిషికి నిల్వ నీడ లేదు కావట్టే ఛీ పొమ్మని ఛీత్కరించుకుంటున్నదీ లోకం. ఎందుకింత నైరాశ్యమని ఆలోచిస్తున్నరా? ఇదిగో ఈ వ్యాసం సదువుతే మీకే అర్థమైతది.
2017 అనుకుంటా... ఓ జర్నలిస్టు మిత్రుడి వాళ్ల నాయిన జగదీశ్‌కు రోడ్డు యాక్సిడెంటైతే గాంధీ దావఖానకేస్కొచ్చిన్రు. పరిస్థితేం బాగలేదు, మనిషి కొరి జీవునం మీదున్నడని తెలిస్తే.. నేను, ఇంకో ఇద్దరు జర్నలిస్టు మిత్రులు ముగ్గురం గల్సి గాంధీ దావఖానకు వోయినం. పోయేసరికే పాపం ఆ పెద్దమనిషి జీవిడిసిండనే వార్త మా కండ్లనెరుపెక్కించింది. మేమే గాదు, ఆ పెద్దమనిషి కోసం అక్కడికొచ్చిన ప్రతీ ఒక్క మనిషి కంట నీళ్దీసిండు. కనీ, కాలంజేసిన పెద్ద మనిషి పెద్దొ కొడుకైన మా దోస్తు మాత్రం కంట నీళ్దియ్యలె. అదే దావఖాన్ల కాల్గాలిన పిల్లి లెక్క అటీటు తిర్గుతనే ఉన్నడు. నాకెందుకో తేడా గొట్టి అక్కడున్న వాళ్లూరి పెద్ద మనుషులను “ఆయనేంది అట్లా అటీటు తిర్గుతున్నడు’ అనడిగిన. ‘శవాన్ని ఓనర్లు ఇంటికి తీస్కరావద్దంటున్నరటా?’ అని అటునుంచి జవాబొచ్చింది. మా దోస్తుకిల్లు లేదనే ముచ్చట మాకప్పటిదాన్క తెల్వదు. ‘మరెట్లా?’, ‘గదే ఏడికి తీస్కపోవాల్నో సమజ్ గాకనే ఆయన పరేషాన్ అయితున్నడ’ని శెప్పవట్టిర్రు.
మా దోస్తు దగ్గరికి మేం ముగ్గురం వొయి ఎట్లా జేద్దాం? ఏం శేద్దాం అని ఇశారం జేసినం. ఒకతను అత్తగారింటికేస్కపోదామా అని, ఇంకొగతను సక్కగా శ్మశానానికే తీస్కోపోదామా? అని, తెలిసోనోళ్లనెవరినైనా సాయమడుగుదామా అని ఇంకొగతను వాళ్లకు తోచింది వాళ్లు శెప్పవట్టిండ్రు. మా దోస్తుకు ఏమనిపించిందో ఏమో గనీ ఒక్కసారిగా, అమాంతం మా అందరిమీద వడి ఒక్కతీర్గ ఏడ్వవట్ట్టిండు. అప్పటిదాన్క ఆగవట్టుకున్న ఏడ్పు ఎతలు ఎతలుగా బైటికచ్చింది. పుట్టెడు దుఃఖంలున్న మా దోస్తును గట్టిగల్ముకొని బాధవడకు మిత్రమా నీకు మేమున్నమని భరోసిచ్చినం. యాదృచ్ఛికంగా ఆ రోజు స్నేహితుల దినోత్సవం కూడా. కాలంజేసిన పెద్దమనిషి ఆటో నడుపుతూ వాళ్లూర్లనే ఓ గుంట భూమి కొనుక్కున్నడు గనీ, ఇల్లు కట్టుకునే ఐశత్ లేక కిరాయి ఉంటుండనే విషయం కొద్దిసేపటి తర్వాత మాకు దెల్సింది. తెల్సుడే ఆల్షం. ‘ఆ భూమిల ఇప్పటిమందం రేకులేశి.. కథకథోలె కార్యం ఒడ్డెక్కిచ్చుకుందాం సామీ’ అని మా దోస్తునడిగినం. ‘అదిప్పుడయ్యే పనేనానువయా? అన్ల సర్కారు తుమ్మలు మొల్శినయి’ అని మళ్లా శోకం బెట్టిండు. ‘ఎహ్హె.. అక్కడికెళ్లి నాయినను సాగదోలితే నీకు ఓకేనా’ అనడిగితే.. ‘అంతకంటే మాభాగ్యం ఏముంటది?’ అని ఉల్టా మమ్మల్నే అడుగవట్టిండు. దోస్తు అట్లా అడుగుడే లేటు.. ఫోన్లనే పని గానిచ్చినం. ఆ పెద్ద మనిషి శవం తన సొంతూరుకి వొయ్యేసరికి వాళ్ల భూమిల మొల్శిన సర్కార్ తుమ్మలు సాఫై, రేకుల గుడిసె మొల్శింది.
సీన్ కట్ చేస్తే.. పొద్దూకి ఏడు గొట్టేసరికి ఆ పెద్దమనిషిని దానం జేసినం. ఇప్పటిదాకా ఒకెత్తయితే. ఇప్పుడొకెత్తు.. అది వానకాలం సీజన్. దబ్బన ఈదురుగాలలతో కూడిన వాన కురిస్తే మా బతుకులు ఎట్లనని మా దోస్తుకు ఆ పదకొండొద్దులు కంటిమీద కునుకు లేదట. మనుషులకేమో గనీ, ప్రకృతికి ఆ మాత్రం నియ్యతుండదా? ఆ పదకొండొద్దులు సుక్క వాన వడలేదట. ఆ పదకొండొద్దుల తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు సూడుర్రి. కార్యమంత ఒడ్డెక్కిచ్చుకొని కిరాయింటికి వోయిన మా దోస్తుకు చేదనుభవం ఎదురైంది. ‘కాలం జేసింది మీ నాయిన, పైగా నువ్వే సావు జేసినవ్ కావట్టి మీరు మా ఇల్లు కాల్జెయ్యిర్రి.. లేకుంటే మాకరిట్టం..’ అని ఏ మాత్రం కనికరం లేకుండా కఠువుగా శెప్పిండట ఆ ఇంటి ఓనర్. దిక్కులేని పరిస్థితుల్లో ఫోన్జేసి నాకు ముచ్చట శెప్పవట్టిండు నా దోస్తు. అప్పటికప్పుడు ఇల్లు ఖాళీజేసి సామాన్లు ఆ ఊరి గ్రామపంచాయతీలోని ఓ అర్రలేసి ఇంటి ఐదుగురు నా రూముకొచ్చిర్రు. బేగంపేటలోని నా బ్యాచిలర్ రూంను వాళ్లకప్పజెప్పి నేను వేరే దోస్తు రూముకు వోయిన. నాయిన కాలంజేసిండనే బాధకన్న, ఆ గడ్డుకాలంల నుంచి ఎట్లా గడ్డకెక్కుతనోననే రందే ఎక్కువైంది మా దోస్తుకు. ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు శెప్పవలసి వస్తున్నదంటే...
కోల శంకర్ గౌడ్ అనే ఒక వ్యక్తి దివంగత ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్నని చేపట్టిన సమ్మెలో తనకు తానుగా ఒంటిపై పెట్రోల్‌తో నిప్పంటించుకొని బలైన ఒక బహుజనుడు. ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమైనయన్నా, ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కి మనసొంటి ప్రయాణీకుల కష్టాలు తీరుస్తున్నయన్నా దానికి కారణం నూటికి నూరుపాళ్లు ఈ ఆర్టీసీ డ్రైవర్ శంకరే. శంకర్ బలిదానమే ఒక విషాదం అంటే.. అతని జీవితం ఇంకా విషాదం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఖానాపురం ఆయన పుట్టినూరు. తన తండ్రి నుంచి ఒక గుంట భూమి వారసత్వంగా వస్తే.. తల్లిదండ్రుల అనారోగ్య నిమిత్తం అది కూడా అమ్ముకున్నడు. అప్పటి నుంచి గత 20 ఏండ్లుగా నర్సంపేటలోనే కిరాయి ఉంటున్నడు. శంకర్‌కు భార్య, ఒక కొడుకు, కూతురున్నా ఎక్కడా ఒక్క గుంట భూమి లేదు. లారీ డ్రైవర్‌గా ఒక పదేండ్లు, దగ్గెర దగ్గెర ఓ 25 ఏండ్ల పాటు ఆర్టీసీకి సేవలందించి సొంతంగా ఒక రేకుల షెడ్డు కూడా వేసుకోలేని ఒక అభాగ్యుడు. శంకర్ ముక్కుసూటితనం, మంచితనం, అతని నియ్యతే దీనికి కారణమేమో. ఒక్క బిడ్డకు మాత్రం లగ్గం జేసి ఒగయ్య శేతిల వెట్టిండు. ఆ అయ్య ఊరి పేరే ముత్తోజిపేట.
2026, ఏప్రిల్ 24వ తెల్లవారుజామున సుమారు ఒంటిగంట ప్రాంతాన శంకర్‌గౌడ్ కాలంజేసిండనే సమాచారం అధికారికంగా ప్రజలకు తెలిసింది. అయితే, నాడు గాంధీ దవాఖానలో కాలంజేసిన పెద్దమనిషి జగదీశ్‌ది, నేడు డీఆర్‌డీఓ అపోలో దవాఖానలో కాలంజేసిన శంకర్ గౌడ్ ఇద్దరిదీ ఒక్క స్థితి. ఇంటి ఓనర్‌కు ఇరువై ఏండ్లుగా లేని భయం శంకర్ గౌడ్ కాలంజేసినంకనే ఎందుకు వుట్టిందో ఆ దేవునికే ఎరుక. ఆయన శవం మా ఇంటికొస్తే మాకు మంచిగైతదో లేదోనని మూతి ముడ్సుకున్నడట. శంకర్‌గౌడ్ శవాన్ని మా ఇంటికి తీసుకురావొద్దంటే తీసుకురావొద్దని మంకుపట్టు వట్టిండట ఆ ఇంటి ఓనర్! అటు నర్సంపేటకు రానియ్యక, ఇటు పుట్టినూరు ఖానాపూరంలో సొంతిళ్లేమో గనీ, కనీసం ఆరడుగుల జాగ కూడా కరువైందట. ‘ఆడిబిడ్డ ఇల్లం సుట్టపు సూపు లెక్క ఉండాలె గనీ, వారాలకు వారాలు తినుకుంటా అక్కడుంటమా’ అని ధిక్కరించిన శంకర్‌గౌడ్‌కు ఆఖరికి అల్లుని ఇల్లే దిక్కైందని శంకర్ ఆలి ఏడుస్తా ఉంటే ఒక్కొక్కరి గుండెలవిసిపోయినయట!
ఇదిట్లా ఉంటే మొన్నటికి మొన్న కన్నారం జిల్లా చింతకుంటల ఓ విషాద కథ. శ్రీకాంత్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నడు. శ్రీకాంత్ భార్య, పిల్లలు శ్రీకాంత్ కాలంజేసిండన్న బాధలుంటే ఇంటి ఓనరొచ్చి వాళ్లను బైటికి నూకేసిండు. ఆఖరికి ఆ కుటుంబానికి శ్మశానమే దిక్కైంది. ఓ దిక్కు శవం కాలుతుంటే.. ఆ అగ్నికీలలను చూసుకుంటూ సుమారు ఆరు రోజుల పాటు శ్మశానంలనే జీవించిందా కుటుంబం. పాపం ఆ కుటుంబానిది ఎంతటి దీనస్థితి?
ఒక్క కాకి కాలంజేస్తే.. సూసుకుంట ఉండలేని ఓ నాలుగైదు కాకులు కావ్‌కావ్‌మంటూ వంద కాకులను జమజేస్తయి. కాలంజేసిన కాకిని దానం జేసేదాన్క వాటి బాధ్యతను మరువయి. ఆ కాకుల్లో ఉన్నటువంటి మానవీయత నేటి మనుషుల్లో కరువైంది. మారుతున్న సంప్రదాయాలు ఈ దుస్థితికి కారణమవుతున్నయి. తనకనుకూలంగా అలవాట్లను మార్చుకుంటున్న మనిషి, కాలానుగుణంగా సంప్రదాయాలను మార్చుకోవడంలో మాత్రం వెనుకపడుతున్నడు. పైన శెప్పినట్టు.. ఒక్క మనిషి ఎన్నటికున్నా కాలం జేయాల్సిందే. ఒగలు ముందూ, ఒగలు వెనుక. అంతే తేడా. ఇది అర్థం చేసుకున్నప్పుడే ఒక మనిషి సాటి మనిషికి కష్టాల్లో తోడుంటడు. లేనంతకాలం మనిషి కఠువుగానే ఉంటడు. ఇది ముమ్మాటికీ నిజం.
గడ్డం సతీష్
99590 59041
(సీనియర్ జర్నలిస్ట్)














