రాష్ట్ర ప్రభుత్వం బాపూఘాట్ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రక్షణ శాఖకు చెందిన 83 ఎకరాల భూముల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మూసీ ప్రాజెక్టుకు అనుమతిచ్చింది. రక్షణశాఖకు చెందిన గోల్కొండ ఆర్టిలరీ పరిధిలోని రూ.533 కోట్ల విలువైన భూముల బదలాయింపునకు అంగీకారం తెలిపింది. అయితే తాము సరోవర్ ప్రాజెక్టుకు ఇవ్వబోయే రూ.533 కోట్ల విలువైన భూములను బదులుగా మరోచోట ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి షరతు విధించింది. ఈ ప్రాజెక్టుకు రక్షణశాఖ అనుమతించిన నేపథ్యంలో ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూముల బదలాయింపు కీలక మైలు రాయిగా సీఎం అభివర్ణించారు.


ఇక భూసేకరణ వేగవంతం

మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనుంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అక్కడున్న రక్షణ భూములు ఇవ్వాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కోరిసన విషయం తెలిసిందే. మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయనకు వివరించారు. దానికోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పరంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టులో మహాత్మగాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే విజ్ఞాన కేంద్రం, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మించనున్నారు. అయితే దీనికి అక్కడ రక్షణ శాఖ భూములు కూడా అవసరం అయ్యాయి. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతి మంజూరు లభించడంతో ఇక నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. అధికారులు కూడా ఈ ప్రాజెక్టు కోసం భూ సేకరణ ప్రక్రియను ముమ్మరం చేశారు.