ఏసర్ భారత టెక్ మార్కెట్లో సరికొత్త ల్యాప్‌టాప్ లాంచ్ చేసింది. కంపెనీ దీనిని ఏసర్ ఆస్పైర్ 5 AI పేరిట తీసుకొచ్చింది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల WUXGA డిస్‌ప్లే, 32GB వరకు LPDDR5 RAM, 1TB వరకు NVMe SSD స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది విండోస్ 11 హోమ్‌పై పనిచేస్తుంది. కంటెంట్ వినియోగం, తేలికపాటి గేమింగ్ కోసం ఆస్పైర్ 5 AIని సన్నగా, తేలికగా ఉండే ల్యాప్‌టాప్‌గా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.


ఏసర్ ఆస్పైర్ 5 AI ధర, లభ్యత

ఏసర్ ఆస్పైర్ 5 AI ధర భారతదేశంలో ర్.79,999 నుండి ప్రారంభమవుతుంది. కాగా, కేవలం సిల్వర్ రంగులో మాత్రమే లభిస్తోన్న ఈ ల్యాప్‌టాప్ ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, ఏసర్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.


ఏసర్ ఆస్పైర్ 5 AI స్పెసిఫికేషన్లు

ఏసర్ ఆస్పైర్ 5 AIలో 1,920 x 1,200 పిక్సెల్ రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియోతో కూడిన 14-అంగుళాల WUXGA IPS డిస్‌ప్లే ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5, ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ ప్రాసెసర్‌ల ద్వారా పనిచేస్తుంది. ఏసర్, ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125H చిప్‌ను ఒక కాన్ఫిగరేషన్‌లో చేర్చింది. దీని బేస్ క్లాక్ స్పీడ్ 3.6GHz, బూస్ట్ స్పీడ్ 4.5GHz వరకు ఉంటుంది.

ఆస్పైర్ 5 AI ల్యాప్‌టాప్‌ను 32GB వరకు LPDDR5 RAM, 1TB వరకు PCIe Gen 4 NVMe SSD స్టోరేజ్‌తో కాన్ఫిగర్ చేసుకోవచ్చని ఏసర్ చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్ 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. వీడియో కాల్స్ కోసం, ఈ పరికరంలో ఫిజికల్ ప్రైవసీ షట్టర్‌తో కూడిన ఫుల్-HD వెబ్‌క్యామ్, అంతర్నిర్మిత మైక్రోఫోన్, HD ఆడియో సపోర్ట్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

ఏసర్ ఆస్పైర్ 5 AI ల్యాప్‌టాప్ 53.8Wh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది USB టైప్-సి ద్వారా 65W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 180-డిగ్రీల హింజ్, ఇంటిగ్రేటెడ్ కోపైలట్ కీతో కూడిన బ్యాక్‌లిట్ కీబోర్డ్, మరియు రెండు వేళ్ల స్క్రోలింగ్, పించ్ గెస్చర్స్, మరియు మల్టీటాస్కింగ్ కమాండ్‌లకు మద్దతు ఇచ్చే మల్టీ-గెస్చర్ ప్రెసిషన్ టచ్‌ప్యాడ్ ఉన్నాయి. ఏసర్ ఈ పరికరంతో ఒక సంవత్సరం క్యారీ-ఇన్ వారంటీని అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ కొలతలు 312.5 x 218.5 x 17.5mm. దీని బరువు సుమారుగా 1.2 కిలోలు.

ఏసర్ ఆస్పైర్ 5 AI కనెక్టివిటీ కోసం Wi-Fi 6 (802.11a/b/g/n/ac/ax సపోర్ట్‌తో), బ్లూటూత్ 5.1 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో రెండు USB 3.2 Gen 1 Type-C పోర్ట్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఫుల్-ఫంక్షన్ పోర్ట్ కాగా, మరొకటి ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అదనంగా, ఇందులో మూడు USB 3.2 Gen 1 Type-A పోర్ట్‌లు, ఒక HDMI పోర్ట్, ఒక SD కార్డ్ రీడర్, ఒక 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఒక కెన్సింగ్‌టన్ లాక్ స్లాట్ ఉన్నాయి.