
మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ (ఏఎన్‌ఎం) పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు కేసులు పరిష్కారం కావడంతో ఫలితాల విడుదలకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమవుతోంది. మరో 3 రోజుల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని బోర్డు అధికారులు బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియామకాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఆరోగ్యశాఖలో నియామకాలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే 12,649 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఏఎన్‌ఎం పోస్టులకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ వద్ద ఉన్న కేసులోనూ ప్రభుత్వం నియామకాలు ఆపోద్దని వాదనలు బలంగా వినిపించింది. ఈ క్రమంలోనూ కోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు 2024 డిసెంబర్‌లో ఏఎన్‌ఎం పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష నిర్వహించింది. కానీ, కోర్టులో కేసు ఉండడంతో తుది ఫలితాలను వెల్లడించలేకపోయింది.
కోర్టు తీర్పుతో లైన్ క్లియర్
ఈ కేసులో ఇటీవలే కోర్టు తుది తీర్పును ఇచ్చింది. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 20 శాతానికి మించి వెయిటేజీ ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గతంలో వివిధ కేసుల్లో సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో నియామక బోర్డు న్యాయశాఖను న్యాయ సలహా కోరింది. గతంలో ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, ప్రస్తుత కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం 20 శాతానికి మించి వెయిటేజీ ఇస్తే మళ్లీ న్యాయపరమయిన సమస్యలు తలెత్తి, నియామక ప్రక్రియ ప్రమాదంలో పడుతుందని న్యాయశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ప్రకారం 20 శాతం వెయిటేజీ ఇచ్చి, రిక్రూట్‌మెంట్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ అంశంపై రివ్యూ చేసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేసి,
భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో 1931 పోస్టులకు సంబంధించిన పోస్టుల ఫలితాల విడుదలకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమవుతోంది. 2023 ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 డిసెంబర్‌లో రాత పరీక్ష జరిగింది. సుమారు 25 వేల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగా, 20,600 మంది పరీక్షకు హాజరయ్యారు. సుమారు మూడు సంవత్సరాలుగా వీరంతా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. కోర్టు తీర్పు, ప్రభుత్వం నిర్ణయంతో వీరి ఉద్యోగ ఆకాంక్షలు త్వరలో నెరవేరనున్నాయి. ఈ రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 12,649 ఉద్యోగాలు భర్తీ చేసింది. 1931 ఏఎన్‌ఎం పోస్టుల రిక్రూట్‌మెంట్ పూర్తయితే, రేవంత్ సర్కార్ భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 14,580కి చేరుతుంది.
కేసు నేపథ్యం
ఆరోగ్యశాఖలో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ఉద్యమ సమయంలో, 2014 మేనిఫెస్టోలో (అప్పటి టిఆర్‌ఎస్)బిఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ హామీని నిలుపుకోలేకపోయింది. ఈ క్రమంలో ఏఎన్‌ఎంలు రకరకాలుగా గత సర్కార్‌పై తమ నిరసన తెలియజేశారు. పలుమార్లు సమ్మెలు చేశారు. 2023లో ఏఎన్‌ఎంల నిరసనలు తీవ్రం అయ్యాయి. దీంతో 2023 ఎలక్షన్లకు మూడు నెలల ముందు, ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి గత సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఏఎన్‌ఎంలను బుజ్జగించేందుకు వారికి 30 మార్కుల వెయిటేజీ ఇస్తామని నోటిఫికేషన్‌లో ప్రకటించింది. దీంతో నిరుద్యోగ (నాన్ సర్వీస్) ఏఎన్‌ఎంలు కోర్టుకు వెళ్లారు. 30 మార్కులు ఇవ్వడం చట్ట విరుద్ధం అని, వెయిటేజీని పూర్తిగా తీసివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నియామకాలకు బ్రేకులు పడ్డాయి.













