హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. యూత్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని చెప్పిందని అన్నారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ.. యూత్ డిక్లరేషన్ పై 30న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేస్తామని, ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో చలో సరూర్ నగర్ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. రైతులు, విద్యార్థుల విషయంలో ప్రభుత్వంలో చలనం లేదని  తలసాని శ్రీనివాస్ యాదవ్  మండిపడ్డారు. లక్షల మంది విద్యార్థులను ఖర్చు లేకుండా చదివిస్తామన్నారని, విదేశీ విద్య విషయంలో మాజీ సిఎం కెసిఆర్ ఇచ్చిన నిధుల కంటే ఎక్కువ ఇస్తామన్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్థులకు మెమోలు ఇవ్వని కాలేజీ యాజమాన్యాలు అని విమర్శించారు. విద్య విషయంలో అతి తక్కువ కాలంలోనే అద్భుతాలు చేసిన ఘనత కెసిఆర్ ది అని కొనియాడారు. రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా..చేతలు దాటడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మేల్కోకపోతే జూన్ లో నిరసన కార్యక్రమాలతో కనువిప్పు కలిగేలా చేస్తామని, యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.