
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు హస్తిన పర్యటనకు వెళ్ళడం రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం హరీశ్‌కు ఇష్టంలేకే బిజెపి నేతలతో కలిసి రహస్యంగా హస్తినకు వెళ్ళారని ఇరువురు మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడి చేశారు. ఈ ప్రకటనలు ప్రకంపనలు సృష్టించాయి. అయితే ఈ ఆరోపణలను, అ నుమానాల వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ అధినాయక త్వం తోసిపుచ్చింది. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు హరీశ్‌రా వు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినో ద్ కుమార్ ఢిల్లీ వెళ్ళారని పార్టీ అధినాయకత్వం సో మవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
కాళేశ్వ రం ప్రాజెక్టుపై కమిషన్ వెలువరించనున్న తీర్పు పై చర్చించేందుకు త్రిసభ్య కమిటీలో భాగంగా హరీశ్‌రావు వెళ్ళారని పార్టీ స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడు తూ హరీశ్‌రావు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నారన్న విషయాలు బయటకు రావాలన్నారు. బిఆర్‌ఎస్ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ డబ్బుతో జగిత్యాలతో జనసమీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కుట్ర, అక్కసు, కుతంత్రం ఎందుకని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
బిఆర్‌ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్కరోజే విఐపిః చామల
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికి బిఆర్‌ఎస్‌లో చేరిన ఒక్క రోజే విఐపిగా ఉంటారన్నారు. బిఆర్‌ఎస్‌లో ముసలం మొదలైందన్నారు. జీవన్ రెడ్డిని చేర్చుకోవడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు. జీవన్ రెడ్డిని హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. కెటిఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదని ఆయన తెలిపారు. రెండవ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు కెటిఆర్ హరీష్ రావును బ్రతిమిలాడి జీవన్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్ళారని ఆయన చెప్పారు. కెసిఆర్ నివాసానికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదన్నారు.
కెసిఆర్ సంవత్సరం తర్వాత బయటకు వస్తుంటే హరీష్ రావు ఢిల్లీకి ఎందుకెళ్ళారని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. హరీష్ రావు ఢిల్లీలో ఎవరెవరిని కలిసారన్నది త్వరలో బయటకు వస్తుందన్నారు. హరీష్ రావు భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. జీవన్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని ఆయన తెలిపారు. జీవన్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ బలహీన పడిందని చెప్పే ప్రయత్నం బిఆర్‌ఎస్ చేస్తోందని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్‌లో ముసలం మొదలైందని, అది మునిగిపోయే పడవ అని ఎంపీ చామల అన్నారు.
రహస్యంగా ఢిల్లీకి..ః అద్దంకి ఆరోపణ
కౌన్సిల్‌లో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌లో జీవన్ రెడ్డి చేరిక ఆ పార్టీ చీలికకు దారీ తీస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డిని చేర్చుకోవడాన్ని హరీష్ రావు వ్యతిరేకించారని ఆయన తెలిపారు. ఎర్రవల్లిలోని కెసిఆర్ ఫాం హౌస్‌కు జీవన్ రెడ్డి వెళ్ళినప్పుడు హరీష్ రావు అక్కడ లేరని ఆయన చెప్పారు. బిజెపి నేతలతో కలిసి హరీష్ రావు రహస్యంగా ఢిల్లీ వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు. హరీష్ రావు అలక వెనుక కారణాలు ఏమిటీ?, పార్టీ చీలికకు హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారా?, అందుకే ఢిల్లీ వెళారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అద్దంకి అన్నారు. హరీష్ రావు పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి జీవన్ రెడ్డి చేరిక వల్ల ఏర్పడిందన్నారు. ఏడాది తర్వాత కెసిఆర్ జగిత్యాల సభకు వెళితే ఆ సభకు హరీష్ రావు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు.
ఖండించిన బిఆర్‌ఎస్ నాయకత్వం..
ఇదిలాఉండగా కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను బిఆర్‌ఎస్ ఖండించింది. తమ పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లిందని ఆ పార్టీ నాయకత్వం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్ ఉన్నారని తెలిపింది. ఈ నెల 22న హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై వెలువడనున్న తుది తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను సిద్ధం చేసేందుకు వీరు ఢిల్లీ వెళ్లారని వివరించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా చర్చిస్తుందని తెలిపింది. కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో చర్చించనున్నట్లు పేర్కొంది.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వివరణ
ఇదిలాఉండగా హరీష్ రావుతో వెళ్ళిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మాట్లాడేందుకు వచ్చామన్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పొద్దున కాంగ్రెస్ తరపున మాట్లాడి రాత్రి బిజెపి నేతలతో చర్చలు జరపడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటేనని ఆయన విమర్శించారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు ..కాంగ్రెస్ నేతలకు అందరూ రేవంత్ లాగానే ఉంటారనిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ ఏదో కలకలం జరగాలని కాంగ్రెస్ నేతలు గుంత కాడి నక్కల్లా ఎదురుచూస్తున్నారని, వారి ఆశలు ఎప్పటికీ నెరవేరవని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు మంత్రులు హరీష్ రావుపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని ఆయన హితవు చెప్పారు.
మంత్రి తుమ్మలకు కౌంటర్
ఇదిలాఉండగా అంతకుముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన ఆరోపణలను ఎంపీ వద్దిరాజు ప్రస్తావిస్తూ అవి నిరాధారమైనవని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడి జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో తమ పార్టీలో చేరడాన్ని తామంతా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.చాలా రోజుల తర్వాత కెసిఆర్ సభ పెడుతుండడంతో కాంగ్రెస్ నాయకులు దిక్కుతోచని స్థితిలో భీతిల్లిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరడం వెనుక ఉద్దేశమేమిటో విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని ఎంపీ వద్దిరాజు వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ రాజకీయ పునర్జన్మ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి మంత్రి మాట్లాడారని, బిఆర్‌ఎస్, కెటిఆర్, హరీష్ రావులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల తరహాలో డబుల్ గేమ్ ఆడడం, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడం తమకు రాదని, ప్రభుత్వం తీసుకునివచ్చిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూనే కేంద్ర మంత్రి ఇంట్లో జరిగిన విందుకు హాజరు కావడాన్ని ఎంపీ వద్దిరాజు ప్రశ్నించారు.



