
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వేగంగా, ప్రభావవంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఒక ప్రత్యేక గుర్తింపుగా మారింది. 2016లో నోట్ల రద్దు, 2019లో ఆర్టికల్ 370 రద్దు, ప్రస్తుతం మహిళల రిజర్వేషన్, శాసనసభ స్థానాల విస్తరణ, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రతిపాదనలు.. ఇవన్నీ ప్రభుత్వ నిర్ణయాలలో వేగం, విస్తృతిని ప్రతిబింబిస్తున్నాయి. ఇవి సాధారణ విధాన మార్పులు కాకుండా, దీర్ఘకాలిక నిర్మాణాత్మక సమస్యలకు చారిత్రాత్మక పరిష్కారాలుగా ప్రదర్శిస్తున్న మార్పులు. అయితే, భారతదేశం వంటి విస్తారమైన, విభిన్నమైన, అసమానతలతో కూడిన ప్రజాస్వామ్యంలో ప్రశ్న కేవలం ‘ఏం చేస్తున్నారు?’ అన్నదే కాదు, ‘ఎలా చేస్తున్నారు?’ అన్నదీ కీలకమే. తీర్మానాత్మక పాలనకు ఆకర్షణ ఉండటం సహజమే.. కానీ తరచూ నిష్క్రియగా విమర్శించే వ్యవస్థలో ధైర్యమైన నిర్ణయాలు, ఉద్దేశం, అధికారాన్ని, దిశను సూచిస్తాయి. అయితే ప్రజాస్వామ్యం, వేగానికి అనుకూలంగా పనిచేసే సాధనం కాదు. అది చర్చలు, సర్దుబాట్లు, సమ్మతి నిర్మాణం మీద ఆధారపడిన వ్యవస్థ. సంస్థల నిర్మాణాన్ని, ప్రజా ప్రతినిధిత్వాన్ని(ప్రాతినిధ్యాన్ని) ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తక్కువ కాలవ్యవధిలో, పరిమిత సంప్రదింపులతో తీసుకుంటే, ప్రజాస్వామ్య ప్రక్రియలు అందించే న్యాయ సమ్మతత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇక్కడ ఆందోళన.. సంస్కరణల అవసరంపై కాదు, వాటిని అమలు చేసే విధానంపై ఉంది.
త్వరిత నిర్ణయాలు తీసుకోవడం, విస్తృత చర్చల తర్వాత నిర్ణయాలకు రావడం మధ్య ఉన్న ఈ ఉద్రిక్తత భారతదేశానికి ప్రత్యేకమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. సంస్కరణల పేరుతో వేగంగా, కేంద్రీకృతంగా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలు అనుకోని పరిణామాలను ఎదుర్కొన్నాయి. టర్కీలో అత్యవసరంగా అమలు చేసిన రాజ్యాంగ మార్పులు కార్యనిర్వాహక అధికారాన్ని కేంద్రీకరించినప్పటికీ, సంస్థల మధ్య సమతుల్యతను బలహీనపరిచాయి. హంగేరీలో వేగవంతమైన చట్టపరమైన, ఎన్నికల సంస్కరణలు ప్రతిపక్ష స్వరాలను అణచివేసి, ప్రజాస్వామ్య రక్షణ వ్యవస్థలను క్రమంగా దెబ్బతీశాయి. బ్రెజిల్‌లో కూడా ఆర్థిక, పరిపాలనా మార్పులు ఆకస్మికంగా అమలు కావడం వల్ల విస్తృత సమ్మతి లేకపోవడంతో సామాజిక అస్థిరతకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఉదాహరణలు ఒక స్పష్టమైన పాఠాన్ని చెబుతున్నాయి.. చర్చల ప్రక్రియలను పక్కన పెట్టిన సంస్కరణలు తక్షణ రాజకీయ ఫలితాలను ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో సంస్థలను బలహీనపరచడం, ప్రజల విశ్వాసాన్ని తగ్గించడం వంటి పరిణామాలకు దారితీస్తాయి.
భారతదేశంలో కూడా ఈ ధోరణి క్రమంగా స్పష్టమవుతోంది. నోట్ల రద్దును అకస్మాత్తుగా ప్రకటించడం ద్వారా నల్లధనం, అవినీతిపై కఠిన చర్యగా చూపించారు. అయితే అమలులో, నగదు ఆధారిత అనౌపచారిక ఆర్థిక వ్యవస్థలో ఉన్న బలహీనతలు బహిర్గతమయ్యాయి. లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి, జీవనోపాధులు కుదేలయ్యాయి. దీర్ఘకాల ప్రయోజనాలపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అలాగే ఆర్టికల్ 370 రద్దును జాతీయ సమగ్రత చర్యగా ప్రదర్శించినప్పటికీ, జమ్మూ-కశ్మీర్‌లో సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలు నిలిపివేసిన పరిస్థితుల్లో ఇది అమలైంది. స్థానిక ప్రజల భాగస్వామ్యం లేకపోవడం, సమాఖ్య సూత్రాలు, ప్రజాసమ్మతి పాత్రపై ప్రశ్నలను లేవనెత్తింది. ఈ రెండు సందర్భాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి- విస్తృత చర్చల కంటే వేగం, నియంత్రణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని. ప్రస్తుతం ప్రతిపాదిత మార్పులు గత చర్యలకంటే మరింత ముందుకెళ్తున్నాయి. మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా శాసన ప్రాతినిధ్యాన్ని పునఃరూపకల్పన చేయాలనే ప్రయత్నం కేవలం విధాన మార్పు మాత్రమే కాదు; రాజకీయ అధికార నిర్మాణాన్ని మళ్లీ చిత్రీకరించే ప్రక్రియగా మారుతోంది. ఈ మార్పులు అత్యంత ప్రభావవంతమైనవి. ఎందుకంటే ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? నియోజకవర్గాలు ఎలా రూపుదిద్దుకుంటాయి? ప్రాంతాల మధ్య రాజకీయ ప్రభావం ఎలా విభజించబడుతుంది? అనే అంశాలను ఇవే నిర్ణయిస్తాయి. అందువల్ల, ఇలాంటి కీలక మార్పులకు మరింత విస్తృత చర్చ, సమ్మతి అవసరం అవుతుంది.
ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజా జనాభా గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, పాత జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే నిర్ణయం, ప్రతినిధిత్వం, ఖచ్చితత్వం, న్యాయబద్ధతపై సందేహాలను రేకెత్తిస్తోంది. భవిష్యత్తు ఎన్నికల చక్రాలకు అనుగుణంగా ఈ సంస్కరణల సమయాన్ని నిర్ణయించడం, సంస్థాగత మార్పుల్లో రాజకీయ ప్రయోజనాల పాత్రపై అనుమానాలను పెంచుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసమాజంతో సమగ్ర చర్చలు జరపకపోవడం, ఈ ప్రక్రియ కార్యనిర్వాహక నిర్ణయాల ఆధారంగా ముందుకు సాగుతోందనే భావనను బలపరుస్తోంది. ఇవి సాధారణ విధానపరమైన అభ్యంతరాలు మాత్రమే కావు; ప్రజాస్వామ్య న్యాయబద్ధతకు సంబంధించిన కీలక అంశాలు.
ఇలాంటి విధానానికి అనేక పార్శ్వాలలో ప్రమాదాలు ఉన్నాయి. మొదటిగా, ప్రజల విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. పెద్ద స్థాయి మార్పులు ఏకపక్షంగా లేదా రాజకీయ ప్రయోజనాలతో చేపట్టినట్లు భావిస్తే, ప్రజలు, రాజకీయ వర్గాల్లో అనుమానాలు మరింత పెరుగుతాయి. ఒకసారి నమ్మకం కోల్పోతే, దాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది. ఇది ప్రజాస్వామ్య సంస్థల పనితీరును కూడా బలహీనపరచగలదు. రెండవది, సమాఖ్య వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమతుల్యతపై భారత రాజ్యాంగ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ప్రతినిధిత్వంలో మార్పులు ఈ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. రాష్ట్రాలపై నిర్ణయాలు రుద్దుతున్నట్లుగా అనిపిస్తే, సహకార సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. మూడవది, కార్యనిర్వాహక అధికార ప్రాబల్యం క్రమంగా సాధారణమవుతుంది. పార్లమెంట్ చర్చల వేదికగా కాకుండా కేవలం నిర్ణయాలను ఆమోదించే స్థాయికి పరిమితమైతే, శాసన పర్యవేక్షణ, కార్యనిర్వాహక అధికారాల మధ్య గీత మసకబారుతుంది.
ఈ అంశాలు ప్రాంతీయ ప్రభావం కోణంలో చూస్తే మరింత గంభీరంగా కనిపిస్తాయి. జనాభా నియంత్రణ, విద్య, ఆరోగ్య రంగాల్లో మెరుగైన ప్రగతి సాధించిన దక్షిణ రాష్ట్రాలు, జనాభా ఆధారిత పునర్విభజనలో వెనుకబడే ప్రమాదం ఉంది. జనాభా వృద్ధిని నియంత్రించిన రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం స్థిరంగా ఉండటం లేదా తగ్గడం చూడవచ్చు. అదే సమయంలో అధిక జనాభా వృద్ధిగల రాష్ట్రాలకు ఎక్కువ రాజకీయ ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. దీనివల్ల మంచి పాలనకు తక్కువ ప్రభావం, అధిక జనాభాకు ఎక్కువ ప్రాధాన్యం లభించే విరుద్ధ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సమాఖ్య వ్యవస్థలో న్యాయబద్ధత, ప్రోత్సాహక వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇలాంటి పరిణామాలు ఆర్థిక పంపిణీ, రాజకీయ ప్రాతినిధ్యంపై ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచి, దేశంలోని విభిన్న ప్రాంతాల మధ్య అసమతుల్యత భావనను పెంచే ప్రమాదం ఉంది.
ఈశాన్య ప్రాంతంలో ఈ మార్పుల ప్రభావం మరింత సున్నితంగా ఉంటుంది. అక్కడి రాజకీయ పరిస్థితులు సంక్లిష్ట జాతి నిర్మాణాలు, చారిత్రక ఒప్పందాలు, నాజూకైన జనాభా సమతుల్యతలపై ఆధారపడి ఉంటాయి. నియోజకవర్గాల పునర్విభజనలాంటి చర్యలు ఈ సమతుల్యతలను మార్చే అవకాశం కలిగిస్తాయి, కొన్ని సందర్భాల్లో ఇవి అనూహ్య పరిణామాలకు దారితీయవచ్చు. గుర్తింపు (ఐడెంటిటీ), ప్రాతినిధ్యం బలంగా అనుసంధానమైన రాష్ట్రాల్లో చిన్నమార్పులు కూడా పెద్ద రాజకీయ ప్రతిస్పందనలకు దారితీస్తాయి. గతంలో పౌరసత్వం, ఓటరు జాబితాల వంటి అంశాలపై జరిగిన అనుభవాలు చూపించినట్లుగా, తగిన సున్నితత్వం, సంప్రదింపులు లేకుండా చేపట్టిన పరిపాలనా చర్యలు ఆందోళనలు, అసంతృప్తిని పెంచుతాయి. ఈ నేపథ్యంలో, సరైన సమన్వయం, ప్రజాభాగస్వామ్యం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశమే ఆందోళనకు కారణమవుతోంది. త్వరిత నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్న వాదన, సంస్కరణలకు వ్యతిరేకం కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలోని సంస్థలను పునర్వ్యవస్థీకరించడం అవసరం. ముఖ్యంగా శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం అత్యవసరమైన, ఆలస్యమైన లక్ష్యమే. అయితే, ఈ సంస్కరణలను అమలు చేసే విధానం కూడా అంతే ముఖ్యమైనది. ప్రజాస్వామ్యం బలంగా ఉండేది కేవలం తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రమే కాదు; ఆ నిర్ణయాలు ఎలా తీసుకున్నామనే ప్రక్రియ కూడా ముఖ్యమే.. సంప్రదింపులు అనేవి అధిగమించాల్సిన అడ్డంకులు కావు; అవే ప్రజాస్వామ్య న్యాయబద్ధతను నిర్మించే, నిలబెట్టే పునాది.
మోడీ ప్రభుత్వం భారీ ఆలోచనలు, ధైర్యమైన చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని ఇప్పటికే చూపించింది. ఇప్పుడు అవసరమైనది అదే స్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల కట్టుబాటు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం, దానితో కొనసాగనున్న చర్చలను నిర్ణయ ప్రక్రియ ముగింపుగా కాకుండా, విస్తృత జాతీయ సంభాషణ ప్రారంభంగా చూడాలి. భారతదేశం వంటి సంక్లిష్ట దేశంలో చరిత్ర సృష్టించడం అంటే కేవలం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు; ఆ నిర్ణయాలకు సమూహ సమ్మతి బలం కల్పించడం కూడా అంతే ముఖ్యమైనది. త్వరితంగా ముందుకు సాగి సంస్థలను పునఃవ్యవస్థీకరించాలనే తపన తక్షణ రాజకీయ లాభాలను ఇవ్వవచ్చు. కానీ ప్రజాస్వామ్యం దీర్ఘకాల దృష్టిని కోరుతుంది. ప్రతినిధిత్వ నిర్మాణాన్ని మార్చే నిర్ణయాలు ప్రభుత్వాల గడువు, ఎన్నికల చక్రాలను మించి కొనసాగుతాయి. అందువల్ల, అవి రాజకీయ, ప్రాంతీయ విభేదాలపై విశ్వాసాన్ని పెంచే విధానాలపై ఆధారపడాలి. చరిత్ర మార్పుల పరిమాణాన్ని గుర్తుంచుకుంటుంది. కానీ ప్రజాస్వామ్య ఆరోగ్యం మాత్రం ఆ మార్పుల సమగ్రత, చర్చ, సమ్మతిపై ఆధారపడి జరిగాయా లేదా వేగం, ఏకపక్ష నిర్ణయాల ఫలితమా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.
గీతార్థ పాఠక్



