
న్యూఢిల్లీ: ప్రపంచస్థాయి తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారత్, దక్షిణ కొరియాలు శాంతి సందేశాన్ని బలీయంగా విన్పిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యం 50 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని సంకల్పించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షులు లీజే మ్యూంగ్‌తో విస్తృత స్థాయి చర్చల తరువాత ప్రధాని మోడీ సోమవారం లీజేతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
చిప్స్ నుంచి షిప్స్ వరకూ, ట్యాలెంట్ నుంచి టెక్నాలజీ వరకూ, ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఎనర్జీ వరకూ ఇరుదేశాల మధ్య సహకారం విస్తరిస్తుందని ఈ సందర్భంగా ఇరువురు నతలు తెలిపారు. చర్చల ఫలితంగా ఇరుదేశాల మధ్య పలు కీలక రంగాల్లో సహకారానికి 15 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో ప్రధానంగా పారిశ్రామిక సహకార వ్యవస్థ సంవిధానం ఖరారు , స్టీల్ సప్లయి వ్యవస్థల పటిష్ట ఒప్పందాలు ఉన్నాయి. ఇంధన, కీలక ఖనిజాలు, నౌకానిర్మాణాలు, సెమికండక్లర్ రంగాలలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఇనుమడించనుంది.
ఇండియా సౌత్ కోరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం దిశలో ఉమ్యడి కార్యాచరణకు దిగాలని సంకల్పించారు. ఇరుదేశాల మధ్య సంయుక్త సమగ్ర చర్చల ప్రక్రియ ఇంతకు ముందు అమలులో ఉంది. దీనిని మరింతగా బలోపేతం చేయడానికి ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దక్షిణ కొరియా నేత ఆదివారం భారత్‌లో మూడురోజుల పర్యటనకు వచ్చారు. దక్షిణ కొరియా నేత భారత్ పర్యటన ఉభయదేశాల విజయయాత్రల మరో దశాబ్దానికి ప్రాతిపదిక అయిందని ప్రధాని తెలిపారు.

