
తమిళనాడు గవర్నర్ ఆర్‌వి ఆర్లేకర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ మండిపడ్డారు. టివికె చీఫ్ విజయ్ అంశంలో ఆయన రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయకుండా బిజెపి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గురువారంనాడు ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్లు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. అలా కాకుండా ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. ‘తమిళనాడుతో పాటు గవర్నర్లు బిజెపి ఏజెంట్లు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. బిజెపి కోసం పనిచేస్తున్నారు’ అని సిబల్ వ్యాఖ్యానించారు. విజయ్‌ను వెంటనే ప్రమాణ స్వీకారోత్సవానికి పిలవాలని హితవుపలికారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని గడువు విధించాలి కానీ, లోక్‌భవన్‌లో బలనిరూపణ జరగాలని కోరుకోవడమేంటని సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్కారియా కమిషన్ ఏం సిఫారసు చేసిందో తెలుసుకోవాలన్నారు. టివికె ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సమయం గడిచిన కొద్దీ పరిస్థితి తారుమారవుతుందని ఆశిస్తున్నారని సిబల్ పేర్కొన్నారు. తమిళనాడు సెకులర్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా బిజెపి మద్దతుతో గవర్నర్ అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ మరో ఎంపి మాణికం ఠాగూర్ ఆరోపించారు. ఆయను వెనుకుండి నడిపిస్తున్నది ప్రధాని మోడీ, అమిత్ షాలేనని అన్నారు. మరోవైపు విజయ్‌కు మద్దతుగా ప్రముఖ నటుడు కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్ కూడా ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇలాంటి సమయంలో స్టాలిన్ రాజకీయ పరిణతి ప్రదర్శిస్తున్నారని, అదే సమయంలో ప్రజల తీర్పుతో మెజారిటీ సాధించిన విజయ్‌ను ప్రమాణ స్వీకారానికి గవర్నర్ పిలువాల్సి ఉందని అన్నారు. ప్రకాశ్ రాజ్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.











