
పెళ్లై అయిదు నెలల్లోనే అత్తింటి వేధింపులకు బలైన నోయిడాకు చెందిన ట్విషాశర్మ మృతి కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోమవారం (25.5.26) ఈ కేసు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ట్విషా భర్త సమర్ధసింగ్ ఒక లాయర్. అత్త గిరిబాలా సింగ్ మాజీ జడ్జి. భోపాల్‌లోని కటారాహిల్స్‌లో అత్తవారింట్లో మే 12న ట్విషా శర్మ ఉరిపోసుకుంది. అంతకు ముందు ఆమె తన తల్లికి, స్నేహితురాలికి తాను నిత్యం వేధింపులతో నరకయాతన అనుభవిస్తున్నానని ఆందోళన వ్యక్తం చేస్తూ మెసేజ్‌లు పంపించింది. అయితే ఆమె ప్రవర్తనపై అత్తింటి వారు అనేక ఆరోపణలు చేశారు. ఆమె గ్లామర్ రంగంలో కొన్నేళ్లుగా ఉండడంతో మానసిక సమస్యలతో బాధపడుతూ మరిజ్వానా డ్రగ్స్ వాడేదని, ఇంట్లో బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించేది కాదని, అర్ధరాత్రుళ్లు బయటకు వెళ్లేదని అత్త గిరిబాల సింగ్ ఆరోపించారు.
ట్విషా గర్భవతిగా ఉన్నప్పుడు అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై భర్త, అత్త తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారని పుట్టింటివారు ఫిర్యాదు చేశారు. ఆమె ఉరివేసుకున్న పరికరాన్ని పోస్టుమార్టమ్ సమయంలో సమర్పించలేదని, ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రీ పోస్టుమార్టమ్ కోసం పుట్టింటివారు డిమాండ్ చేశారు. కానీ అత్త విశ్రాంత న్యాయమూర్తి, భర్త లాయర్ కావడం వల్లనే విచారణలో జాప్యం చేస్తున్నారన్న విమర్శలు రావడంతో సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారణలో ఈ కేసు రిపోర్టింగ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని, నిందితులు, సాక్షులు, మీడియా ఎదుట బహిరంగ ప్రకటనలు చేయరాదని సుప్రీం కోర్టు సూచించింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ కేసు ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక అన్నారు. వివాహితలు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఎదుర్కోవడం కంటే విడాకులు ఇప్పించడమే వారికి క్షేమమని సూచించారు. ఈ కేసుపై ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుతోపాటు మరో రెండు ఇలాంటి కేసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి వెలుగులోకి వచ్చాయి. దీన్నిబట్టి మహిళల ముఖ్యంగా వివాహితుల బతుకులకు ఎంత భద్రత లభిస్తోందో గమనించవచ్చు. మహిళలు చదువుల్లోను, ఉద్యోగాల్లోనూ ఎన్ని విజయాలు అందుకున్నా, ఆర్థిక భద్రత, లేదా పురోగతి, సోషల్ మీడియాలో గుర్తింపు, ఆరోగ్యభద్రతకు అనుసంధానం, హక్కులపై అవగాహన ఇలా ఎన్నో విశిష్టతలు సాధించినా అవన్నీ వరకట్నం డిమాండ్లు, వేధింపులు, మానసిక, భౌతిక హింస ముందు ఏమాత్రం పనిచేయడం లేదు. చివరకు అత్తిల్లు నరకమై వధువుల ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య ఆర్థిక దోపిడీకి, లావాదేవీలకు సాధనంగా కోడళ్లను పరిగణినస్తున్నారు. ఆమె స్వంత ఆలోచనలకు, హక్కులకు సముచిత గౌరవం ఇవ్వకుండా తమ స్వార్థం లేదా ప్రయోజనం సాధించుకునే వస్తువుగా పరిగణిస్తున్నారు.
దేశంలో రోజూ 16 వరకు వరకట్నం చావులు సంభవిస్తున్నాయి. వివాహం అయిన తరువాత ఆడపిల్ల అత్తింటికి, పుట్టింటికి మధ్య పరువు ప్రతిష్టకు సంకేతంగా భావిస్తున్నారే తప్ప ఆమె వాస్తవంగా అత్తింటిలో ఎంత నరకయాతన భరిస్తోందో ఎవరూ గమనించడం లేదు. రెండు కుటుంబాల మధ్య జరిగే ఒప్పందంలో భాగంగా ఎన్నో కష్టనష్టాలు ఆమె భరించవలసివస్తోంది. ఏ కష్టం ఎదురైనా, ఎంతటి హింసకు బలవుతున్నా కడుపులో దాచుకునే సర్దుబాటు తత్వాన్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు.అదే ఆమె పాలిట ప్రాణాంతకమవుతోంది. తన వైవాహిక జీవితం దారుణంగా తయారైందని, ఆమె బయటకు చెప్పినప్పుడు తల్లిదండ్రులు భరించడం లేదు. చాలా మంది నిస్సహాయతతో ఆ పరిస్థితిని ఎదుర్కోవడం ఇష్టం లేక పక్కకు తప్పుకుంటున్నారు.
బాలికలకు పెద్ద చదువులు చెప్పించామని, మంచి ఉద్యోగాలు చేస్తుందని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి గారాబంతో పెంచుకుంటారు. ఇవన్నీ చేసి పెళ్లయిన తరువాత ఆమె బతుకు ఘోర విపత్తుగా మారితే ఎదుర్కోలేకపోతున్నారు. వరకట్నం అన్నది అక్రమమని గత కొన్ని దశాబ్దాలుగా తెలుసుకుంటున్నా ఇప్పుడు సర్వసాధారమైపోయింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఈ దురాచారం ఆడపిల్లల బతుకులను వెంటాడుతోంది. వరకట్నం మరణాలు రోజురోజుకూ ఎక్కువగా ఉంటున్నా అవి నమోదు కావడంలేదు. బాధితురాలు చనిపోయిన తరువాతనే వరకట్న హింస, క్రూరత్వం వెలుగులోకి వస్తోంది. 87% కేసులు ఛార్జిషీట్లకే పరిమితమవుతున్నాయి.
కోర్టుల్లో 90% కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ కేసుల్లో నేరం రుజువై శిక్షలు పడేవి 50% కూడా ఉండడం లేదు. వధువు ఆత్మహత్యకు ప్రేరేపణ నిరూపించడం చాలా కష్టమవుతోంది. గతంలో వరకట్నం కోసం వధువులను సజీవ దహనం చేసే సంఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు ఆత్మహత్యలే ఎక్కువగా జరుగుతున్నాయి. మహిళలపై నేరాల్లో 47% వరకట్నం వేధింపులే ఉంటున్నాయి. ధనిక, పేద అనే తేడా లేకుండా ధనదాహానికి మహిళ సమిధగా దహించుకుపోతోంది. వరకట్న వేధింపులు, హింసకు సంబంధించిన ఫిర్యాదులు రానురాను ఎక్కువగా నమోదవుతున్నాయి. 2024 లో 1.2 లక్షల వరకు కేసులు నమోదయ్యాయి. భర్త, అత్తమామలు కొట్టినా, తిట్టినా, హింసించినా అవన్నీ కుటుంబం పరువు కోసం వివాహితలు భరించాలా? ఆ నరకం నుంచి ఎందుకు తక్షణం బయటపడకూడదు? అన్న ప్రశ్న ఇప్పుడు తల్లిదండ్రులను, పోలీసులను, ప్రభుత్వ వర్గాలను వేధిస్తోంది.











