లక్నో: నిధుల కొరత కారణంగా రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ తో తెగతెంపులు చేసుకున్నట్టు సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసంస్థ టీఎంసీకి సేవలందించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే అఖిలేశ్ యాదవ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రభావం వల్లనే ఈ ఒప్పందం రద్దు చేసుకున్నారంటూ వచ్చిన ఊహాగానాలను ఆయన తోసి పుచ్చారు.

బెంగాల్‌లో ఎన్నికల నిర్వహణ తీరును ప్రశ్నిస్తూ దీన్ని సుప్రీం కోర్టు తక్షణమే సుమోటోగా స్వీకరించాలని , ఓట్ల లెక్కింపు వీడియో రికార్డింగ్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. బెంగాల్ పరిణామాలు వచ్చే ఏడాది యూపీ ఎన్నికల సమయంలో పునరావృతమయ్యే అవకాశం ఉందని, ఎన్నికల మాఫియా కలిసికట్టుగా పనిచేస్తుందని ఆరోపించారు.