మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారు లు, ఉద్యోగుల వేతన సవరణ- 2021 అమలుకు రంగం సిద్ధమైంది. ఆర్‌పిఎస్ 2021 కింద 11 శాతం ఫిట్మెంట్ ప్రయోజనాన్ని ఖరారు చేసేందుకు సంస్థ యాజమాన్యం ముగ్గురు అధికారులతో ‘వేతన కమిటీ’నిఏర్పాటు చేసింది. కె. గీత, (డిప్యూటీ సిఎఓ (ఎస్‌పి & ఎ, సిఇ), సమీరా అఫ్రీన్ (డిప్యూటీ సిపిఎం (ఐటి), వై.శిరీష, (డిప్యూటీ సిపిఎం ఐఆర్ అండ్ డబ్ల్యు, ట్రైనింగ్)లతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు.11 శాతం ఫిట్మెంట్‌తో ఆర్‌పిఎస్ -2021 కింద స్కేళ్లను ఖరారు చేయడంలో యాజమాన్యానికి ఈ కమిటీ సహాయపడుతుంది. ఆర్‌పిఎస్ -2021తో సహా 32 డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్‌టిసి ఉద్యోగులు ఈ నెల 22న సమ్మెకు దిగారు.

దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆర్‌టిసి జెఎసి నేతలతో చర్చలు జరిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి, ఇతర అంశాలతో పాటు ఆర్‌పిఎస్- 2021 కింద 11శాతం ఫిట్మెంట్ ప్రయోజనాన్ని ప్రకటించారు. ఈ ‘వేతన కమిటీ‘ కార్పొరేషన్‌లో గత వేతనాలు, ప్రస్తుత వేతనాలు పోల్చుతూ నివేదిక తయారు చేయడం. ఏప్రిల్ 1, 2021 నాటికి కేటగిరీల వారీగా ఉద్యోగుల సంఖ్య, వారి వేతనాల వివరాలు సేకరించడం, 2021 వేతన స్కేళ్ల సవరణ వల్ల కార్పొరేషన్‌పై పడే ఆర్థిక భారాన్ని, పెరుగుదల శాతాన్ని లెక్కించడం. ఆర్‌పిఎస్ 2021లో కొత్త పే స్కేల్ తయారు చేయాల్సి ఉంటుంది. వేతన కమిటీ తక్షణమే వేతన స్కేలు పనిని చేపట్టి, వేతన నిర్మాణ పత్రాలను ఎటువంటి జాప్యం లేకుండా మే 10వ తేదీలోగా పే స్ట్రక్చర్ షీట్‌ను సమర్పించాలని యాజమాన్యం ఆదేశించింది.

వేతన కమిటీ నియామకంపై జెఎసి హర్షం

వేతన సవరణకు అధికారులతో కూడిన పే కమిటీని ఆర్‌టిసి యాజమాన్యం ఏర్పాటు చేయడం పట్ల ఆర్‌టిసి జెఎసి హర్షం వ్యక్తం చేసింది. ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డిని జెఎసి నేతలు డిమాండ్ల పరిష్కరించినందుకు ఇటీవల సన్మానించారు. సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు 2021 వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాలని ఈ సందర్భంగా ఎండిని కోరామని జెఎసి నేతలు తెలిపారు. దరిమిలా ఆర్‌టిసి యాజమాన్యం పే కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని జెఎసి నేతలు తెలిపారు. మే 10 లోపు 2021 వేతన సవరణకు సంబంధించి కొత్త స్కేల్స్ ను రూపొందించటంతో పాటు వేతన సవరణ విధి విధానాలను రూపొందించాలని ఫైనాన్సియల్ అడ్వైజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆమోదంతో మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశించారని, తాము చేసిన విజ్ఞప్తిని వెనువెంటనే అమలు చేసినందుకు జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరిలు హర్షం వ్యక్తం చేశారు. మిగతా అంగీకరించిన అంశాలను కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా తక్షణమే అమలు చేయాలని జెఎసి నాయకులు కోరారు.