సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర-2026 తేదీలను దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 2న వైభవంగా నిర్వహించనున్నారు.

ఆలయ అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జూలై 19న ఘటోత్సవం (ఎదురుకోలు)తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఆగస్టు 2న ప్రధాన బోనాల ఉత్సవం జరగనుండగా, ఆగస్టు 3న రంగం (భవిష్యవాణి) కార్యక్రమం, గజవాహన ఊరేగింపు నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు

🔸 ఘటోత్సవం (ఎదురుకోలు) – జూలై 19, 2026 (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు

🔸 ప్రధాన బోనాల ఉత్సవం – ఆగస్టు 2, 2026 (ఆదివారం) ఉదయం 4 గంటలకు

🔸 రంగం (భవిష్యవాణి) – ఆగస్టు 3, 2026 (సోమవారం) ఉదయం 8:30 గంటలకు

🔸 గజవాహన ఊరేగింపు – ఆగస్టు 3, 2026 ఉదయం 10:30 గంటలకు

ఈ సందర్భంగా ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ పండితులు సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి ఉత్సవాల వివరాలను అందజేశారు. జూలై 19న ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుందని, ఆగస్టు 2న అమ్మవారికి బోనాల సమర్పణ, ఆగస్టు 3న రంగం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ వర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.