జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కొత్త తరం Q3 SUVని భారత్‌లో ఆవిష్కరించింది. త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ SUV.. ప్రీమియం కాంపాక్ట్ SUV విభాగంలో ఆడి స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది.

మూడో తరం Q3లో కొత్త డిజైన్, అధునాతన టెక్నాలజీ, మరింత ప్రీమియం ఇంటీరియర్ వంటి అనేక మార్పులు చేశారు.

షార్ప్ డిజైన్‌తో కొత్త Q3

కొత్త Q3లో ఆడి తాజా డిజైన్ లాంగ్వేజ్‌ను చూడొచ్చు. ఇందులో పెద్ద సింగిల్-ఫ్రేమ్ గ్రిల్, షార్ప్ LED లైటింగ్, కొత్త బాడీ లైన్స్, బలమైన షోల్డర్ లైన్ వంటి మార్పులు ఉన్నాయి.

వెనుక భాగంలో కనెక్టెడ్ లైటింగ్ ఎలిమెంట్స్, ఇల్యూమినేటెడ్ ఆడి లోగో వంటి ఫీచర్లు SUVకు మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.

కొత్త Q3 గత మోడల్ కంటే పరిమాణంలోనూ కొంచెం పెద్దదిగా ఉంది. దీని పొడవు సుమారు 4,531 మి.మీ, వెడల్పు 1,859 మి.మీ, ఎత్తు 1,623 మి.మీగా ఉండగా.. వీల్‌బేస్ 2,681 మి.మీగా ఉంది.

టెక్నాలజీతో ప్రీమియం ఇంటీరియర్

కొత్త Q3 ఇంటీరియర్‌లో కూడా భారీ మార్పులు చేశారు. ఆధునిక డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌తో పాటు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద టచ్‌స్క్రీన్, కొత్త స్టీరింగ్ వీల్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్, పార్కింగ్ టెక్నాలజీలు కూడా ఇందులో అందుబాటులో ఉండనున్నాయి.

2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్

భారత మార్కెట్‌లో కొత్త Q3కి 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లభించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారు 204 హెచ్‌పీ పవర్, 320 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయనుంది.

ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్తో జతకానుంది. ఆడి ప్రసిద్ధ క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ కూడా అందుబాటులో ఉండనుంది.

ఫెస్టివ్ సీజన్‌లో లాంచ్

కొత్త ఆడి Q3ని 2026 ఫెస్టివ్ సీజన్‌లో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

అధికారిక లాంచ్ తేదీ, ధరలను కంపెనీ తర్వాత ప్రకటించనుంది. లాంచ్‌కు దగ్గరగా ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

BMW X1, Mercedes-Benz GLAతో పోటీ

భారత్‌లో విడుదలైన తర్వాత కొత్త Audi Q3.. BMW X1, Mercedes-Benz GLA వంటి లగ్జరీ కాంపాక్ట్ SUVలతో పోటీ పడనుంది.

కొత్త డిజైన్, టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Q3 ఈ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వాలని ఆడి భావిస్తోంది.