హైదరాబాద్‌కు చెందిన రక్షణ సాంకేతిక స్టార్టప్ భారత డ్రోన్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. BITS పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంక్యుబేట్ అవుతున్న అపోలియన్ డైనమిక్స్ రూపొందించిన ఎలక్ట్రిక్ మల్టీరోటర్ ఇంటర్‌సెప్టర్ ‘ఆహుతి MK-II’ గంటకు 498 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.
ఈ వేగాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. దీంతో భారత్‌లో నమోదైన అత్యంత వేగవంతమైన మల్టీరోటర్ UAVగా ఆహుతి MK-II రికార్డు సృష్టించింది.
ఇప్పటివరకు భారత్‌లో నమోదైన సుమారు 325 కి.మీ. వేగంతో పోలిస్తే.. కొత్త రికార్డు దాదాపు 170 కి.మీ. ఎక్కువ.
సాధారణ డ్రోన్‌లకు భిన్నంగా..
సాధారణంగా మల్టీరోటర్ డ్రోన్లను స్థిరంగా గాల్లో ఉండటం, నిఘా, ఫొటోగ్రఫీ లేదా వస్తువులను మోసుకెళ్లడం వంటి అవసరాల కోసం రూపొందిస్తారు. అయితే ఆహుతి MK-IIను ప్రత్యేకంగా హై-స్పీడ్ ఇంటర్‌సెప్టర్‌గా అభివృద్ధి చేశారు.
వేగంగా దూసుకొచ్చే వైమానిక ముప్పులను తక్కువ సమయంలో చేరుకుని అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆధునిక యుద్ధాల్లో వినియోగిస్తున్న తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్లను దృష్టిలో పెట్టుకుని దీని డిజైన్‌ను అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది.
300 నుంచి 498 కి.మీ. వేగానికి..
అపోలియన్ డైనమిక్స్ అభివృద్ధి చేసిన తొలి ‘ఆహుతి’ డ్రోన్ 2025లో సుమారు గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది.
ఆ తర్వాత ఏడాది లోపే కొత్త వెర్షన్‌ను పూర్తిగా పునఃరూపకల్పన చేసి 498 కి.మీ. వేగానికి తీసుకెళ్లారు. సంస్థ ప్రకారం.. ఫ్రేమ్, ప్రొపల్షన్ సిస్టమ్, మోటార్ కాన్ఫిగరేషన్‌లలో సుమారు 10 దశల్లో మార్పులు, పరీక్షలు నిర్వహించారు.
ఈ అభివృద్ధి ప్రక్రియలో డ్రోన్ వేగాన్ని దాదాపు 66 శాతం పెంచినట్లు సంస్థ తెలిపింది.
భారత సైన్యంతో పరీక్షలు
అపోలియన్ డైనమిక్స్ తన వ్యవస్థలను బబీనా, గోపాల్‌పూర్ వంటి మిలిటరీ ఫైరింగ్, ఆపరేషనల్ రేంజ్‌లలో పరీక్షించినట్లు తెలిపింది. ఈ పరీక్షలకు భారత సైన్యం అందించిన సహకారాన్ని సంస్థ అభినందించింది.
భారత సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా స్వదేశీ మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి సారిస్తోంది. ఇప్పటికే కొన్ని మానవరహిత వ్యవస్థలను భారత సైన్యానికి అందించినట్లు కూడా సంస్థ వెల్లడించింది.
తక్కువ ఖర్చుతో కౌంటర్-డ్రోన్ టెక్నాలజీ లక్ష్యం
కేవలం వేగ రికార్డుకే పరిమితం కాకుండా.. కౌంటర్-డ్రోన్ టెక్నాలజీని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యాల్లో ఒకటని అపోలియన్ డైనమిక్స్ తెలిపింది.
దీని కోసం ఒక నిర్దిష్ట సామర్థ్యాన్ని ఎంత ఖర్చుతో అందించగలమనే అంశాన్ని అంచనా వేసేందుకు ‘స్ట్రైక్ ఎన్వలప్ పర్ రూపీ’ అనే అంతర్గత ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
భారత్‌లో ప్రైవేట్ డిఫెన్స్ టెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. ఆహుతి MK-II సాధించిన 498 కి.మీ. వేగ రికార్డు దేశీయ డ్రోన్ టెక్నాలజీ సామర్థ్యానికి మరో ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది.












