తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన ప్యాటర్న్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల్లో కీలక మంత్రులు అనూహ్యంగా కేబినెట్ నుంచి బయటకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
2015లో తాటికొండ రాజయ్య.. 2021లో ఈటల రాజేందర్.. ఇప్పుడు కొండా సురేఖ. ముగ్గురూ కీలక మంత్రి పదవుల్లో ఉండగానే కేబినెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి కేసీఆర్ ప్రభుత్వంలో తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎంగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఏడాది పూర్తికాకముందే ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. స్వైన్‌ఫ్లూ నియంత్రణలో వైఫల్యం, ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆరోపణలు అప్పట్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
ఆ తర్వాత 2021లో మరో సంచలన పరిణామం. కేసీఆర్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో ఆయనను కేబినెట్ నుంచి తొలగించారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన ఈటల.. బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించారు.
ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ వ్యవహారం మరోసారి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆమెను కేబినెట్ నుంచి తొలగించే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అంతర్గత వివాదాలు, క్రమశిక్షణకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే తన తొలగింపుపై కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వలేదని.. బర్తరఫ్ విధానం సరిగా లేదని ఆమె పేర్కొన్నారు.
ఇక్కడే మరో ఆసక్తికరమైన పాయింట్ తెరపైకి వస్తోంది. తాటికొండ రాజయ్య, కొండా సురేఖ ఇద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలే. ఈటల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకుడు.
దీంతో ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు కీలక నేతలు.. వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రి, డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగి.. ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య కేబినెట్ నుంచి బయటకు రావడం కేవలం యాదృచ్ఛికమేనా?
లేక తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు, పార్టీల్లోని అంతర్గత రాజకీయాల ప్రభావమా?
ఈ మూడు ఘటనలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త చర్చకు తెరతీశాయి.









