న్యూజెర్సీ తెలుగు వారి గర్వకారణమైన తెలుగు కళా సమితి (TFAS), సాయి దత్త పీఠం సహకారంతో నిర్వహించిన “అన్నమయ్యకు ఆరాధన ” కార్యక్రమం భక్తి, సంగీతం, సాహిత్యం, నృత్య కళల సమ్మేళనంగా అద్భుతంగా సాగింది. తెలుగు పదకవితా పితామహుడు, మహా వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య 618వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఉన్న సాయి దత్త పీఠం – శివ విష్ణు టెంపుల్‌లో ఘనంగా జరిగింది.
మే30న మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుకలో అన్నమయ్య జీవిత విశేషాలను ప్రతిబింబించే “అన్నమయ్య చరిత్ర” కూచిపూడి నృత్యరూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ విద్యార్థులు గురువు శ్రీమతి స్వాతి అట్లూరి ఆధ్వర్యంలో అందించిన ఈ నృత్య ప్రదర్శన అన్నమయ్య భక్తి, తాత్వికతను కళాత్మకంగా ఆవిష్కరించింది.
అలాగే అన్నమయ్య కీర్తనలకు భరతనాట్య రూపంలో అచార్య డాన్స్ స్కూల్ విద్యార్థులు అందించిన ప్రదర్శనలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. గురువు శ్రీమతి సౌజన్య బండారు శిష్యులు భక్తిరసంతో కూడిన నృత్యాలతో అన్నమయ్య సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించారు.
సంగీత విభావరిలో భాగంగా మహతి మ్యూజిక్ అకాడమీ, కృష్ణవేణి స్కూల్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్, స్వర రాగ సుధ కళా అకాడమీ విద్యార్థులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి భక్తి పరవశాన్ని కలిగించారు. గురువులు రేఖ బ్రహ్మసముద్రం, విజయలలిత వేమూరి, ఉషా అకెళ్ల శిక్షణలో విద్యార్థులు అందించిన గాన ప్రదర్శనలు విశేష ప్రశంసలు అందుకున్నాయి.
కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా “తెలుగులో రామాయణాలు – విశిష్టత” అనే సాహిత్య ప్రదర్శన నిర్వహించారు. వాల్మీకి, మొల్ల, రంగనాథ, విశ్వనాథ సత్యనారాయణ రామాయణాల నుంచి పద్య పఠనం చేసి తెలుగు సాహిత్య సంపదను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అన్నమయ్య వంటి మహనీయుల వారసత్వాన్ని భావితరాలకు అందించడం ప్రతి తెలుగు సంస్థ బాధ్యత అని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య సంపదను పరిరక్షిస్తూ తెలుగు కళా సమితి చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.
సాయి దత్త పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ రఘు శర్మ శంకరమంచి, ఛారిటీ కార్యక్రమాల ఇన్‌చార్జ్ సుభద్ర పటిబంధ్ల, TFAS బోర్డ్ సభ్యులు, ట్రస్టీలు, కళాకారులు, సంగీత విద్వాంసులు, తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




















