న్యూజెర్సీలో తెలుగు సంగీతాభిమానులను అలరించేందుకు ఐడీఓఎల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ (IGGA) ఆధ్వర్యంలో ఘనమైన సంగీత మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘ప్రవధము సంగీత మహోత్సవము’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆగస్టు 15, 2026 శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్, ఫోర్డ్స్, న్యూజెర్సీలో జరగనుంది.
ఈ వేడుకకు ఎడిసన్ మేయర్ సామ్ జోషి, కమిషనర్ ఎమెరిటస్ ఉపేంద్ర చివుకుల, సముద్రా, ఇంక్. సీఈఓ మంగేష్ చింతమనేని, ఐజీజీఏ వ్యవస్థాపకుడు శరత్ చంద్ర తదితరులు గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.
అలాగే ప్రముఖ ప్రొఫెషనల్ సింగర్ అనితా కృష్ణ, నటుడు, కూచిపూడి కళాకారుడు ఇంద్రనీల్ వర్మ, ప్రొఫెషనల్ కూచిపూడి నర్తకి వర్షిణి అర్జా, సాయి దత్త పీఠం వ్యవస్థాపకుడు, సీఈఓ రఘు శంకరమంచి తదితరులు పాల్గొననున్నారు.
కార్యక్రమంలో అన్నమయ్య శ్రీ పాదార్చన, ఘంటసాల స్వర, సంగీత నృత్య హేళ, ఐజీజీఏ రైజింగ్ స్టార్ సింగింగ్ ప్రోగ్రామ్, లైవ్ మ్యూజిక్, బుర్రకథ వంటి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి దాము గెదెల, ప్రసాద్ వూటుకూరు, పూర్ణిమ గిర్కల, మధులత పంత్రంగి, ఈశ్వరి లుకులపు, శివశంకర్ కనారెమేడల, ఎం.వి. రావు తదితర ఐజీజీఏ నాయకత్వ బృందం సహకరిస్తోంది.
ఘంటసాల సంగీత వైభవాన్ని, తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలను అమెరికాలోని భావితరాలకు పరిచయం చేయడంతో పాటు సంగీత, నృత్య కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సంగీతం, నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలతో న్యూజెర్సీలో జరగనున్న ఈ మహోత్సవం తెలుగు సంగీతాభిమానులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది.










