అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ (IBA) ఆధ్వర్యంలో 22వ వార్షిక ఇండియా డే పరేడ్–2026ను ఆగస్టు 9 (ఆదివారం) మధ్యాహ్నం 1 గంట నుంచి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఇసెలిన్ (వుడ్‌బ్రిడ్జ్) నుంచి ఎడిసన్‌లోని ఓక్‌ట్రీ రోడ్ వరకు జరగనుండగా, అనంతరం ఉమియాధామ్ టెంపుల్ వెనుకభాగంలో భారీ కల్చరల్ ఫెస్ట్ & మేళా ఏర్పాటు చేయనున్నారు.
ఈ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా, ప్రముఖ గాయకురాలు రిచా అనిరుద్, పంజాబీ కళాకారుడు డా. లక్ష్యరాజ్ సింగ్, గాయకుడు మోనాంక్ పటేల్, నటుడు అభిమన్యు దస్సాని ప్రత్యేక ఆకర్షణగా పాల్గొననున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, నృత్యాలు, భారతీయ ఆహార విందులు, కుటుంబ వినోద కార్యక్రమాలతో ఈ వేడుకలు సందడిగా సాగనున్నాయి.
భారతీయుల ఐక్యత, సంస్కృతి, దేశభక్తిని ప్రపంచానికి చాటిచెప్పే ఈ ఇండియా డే పరేడ్‌కు వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారత త్రివర్ణ పతాకాలతో అలంకరించిన శోభాయాత్ర, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలు, కమ్యూనిటీ సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం మరింత వైభవంగా జరగనుందని పేర్కొన్నారు.











