ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ సమీపంలోని ప్లేనోలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎన్నారై వైఎస్సార్ అభిమానులు, వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి, "జోహార్ వైఎస్సార్" నినాదాల మధ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వైకాపా ఎన్నారై విభాగ సమన్వయకర్త ఆలూరు సాంబశివారెడ్డి వీడియో కాల్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ప్రజా సంక్షేమానికి కొత్త దిశను చూపిన నాయకుడు వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని ఆయన కొనియాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ వంటి పథకాల ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.

వైఎస్సార్ పాలనలో అమలైన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఆ అనుభవాలను సమాజానికి తెలియజేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలతో ఆత్మీయ అనుబంధం కలిగి, ప్రతి ఒక్కరి మనసును గెలుచుకున్న ప్రజానాయకుడిగా వైఎస్సార్‌ను వక్తలు స్మరించారు.

ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డి శివ, కోడూరు కృష్ణారెడ్డి, భాస్కర్, వైఎస్సార్, శ్రీకాంత్, వీరశివారెడ్డి, దర్గా నాగిరెడ్డి తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.