అమెరికాలో తెలుగు సంస్కృతి, సనాతన సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) మరోసారి భక్తి వైభవాన్ని ఆవిష్కరించింది. భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే భద్రాచల శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవాన్ని అమెరికా నేలపై అత్యంత ఘనంగా నిర్వహించి తెలుగు ప్రవాసులను భక్తి పరవశంలో ముంచెత్తింది.
ఫ్లోరిడాలోని టాంపా నగరంలో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా వేదికగా మే 30, 2026న నిర్వహించిన ఈ మహోత్సవం వేలాది మంది భక్తులను ఆకట్టుకుంది. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణాన్ని తలపించేలా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
ఉదయం నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. పసుపు కొట్టడం, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపు, పట్టు వస్త్రాల సమర్పణ, సంకల్పం, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం, ప్రత్యేక అర్చనలు, మహామంగళహారతి, ఆశీర్వచన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ప్రతి ఘట్టం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తగా, కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులు శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి పుణ్యఫలాన్ని పొందారు.
తెలుగు రాష్ట్రాలకు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, స్వదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలను అమెరికా గడ్డపై అదే భక్తి శ్రద్ధలతో నిర్వహించడం విశేషంగా నిలిచింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం అంతా "జై శ్రీరామ్" నినాదాలతో మార్మోగి భక్తిమయ వాతావరణాన్ని సృష్టించింది.
ఈ సందర్భంగా మాటా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరాలకు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను చేరవేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులు, సేవకులు, ఆలయ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా, జూన్ 19 నుంచి రెండు రోజుల పాటు పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహించనున్న మాటా ద్వితీయ మహాసభలను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు ప్రజలు పాల్గొనే ఈ మహాసభలు తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళలు, వ్యాపార అవకాశాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు గొప్ప వేదికగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
అమెరికా నేలపై నిర్వహించిన భద్రాచల శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా, తెలుగు సంప్రదాయాల పట్ల ప్రవాస భారతీయులకున్న అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన మహోత్సవంగా నిలిచింది.




















