ఉత్తర కరోలినాలోని గార్నర్ (Garner, NC) నగరంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు Shiny Stars సంస్థ సన్నాహాలు పూర్తి చేసింది. ఆగస్టు 15వ తేదీ ఉదయం 10 గంటలకు Garner United Methodist Churchలో ఈ కార్యక్రమం జరగనుంది. భారతీయ సంస్కృతి, వారసత్వం, దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో భారత సైనిక వీరులకు, వారి కుటుంబాలకు ప్రత్యేక నివాళి అర్పించనున్నారు. చిన్నారులు, పెద్దల కోసం ఫ్యాషన్ షోలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, భారతీయ వారసత్వాన్ని పరిచయం చేసే ప్రత్యేక విభాగం, వివిధ వెండర్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే భారతీయ రుచులను ఆస్వాదించేందుకు ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.
భారతీయ సంప్రదాయాలు, దేశభక్తి, సంస్కృతిని ఒకే వేదికపై ఆవిష్కరించే ఈ వేడుకలకు నార్త్ కరోలినా పరిసర ప్రాంతాల్లోని భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముందస్తు నమోదు (RSVP) చేయాలని సూచించారు.











