అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు వేదికగా మారింది. American Telugu Association (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ATA మహాసభలు, యూత్ కన్వెన్షన్ తొలి రోజు వేడుకలు వేలాది మంది ప్రవాస తెలుగువారి సమక్షంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలు ప్రవాస తెలుగు సమాజ ఐక్యత, సంస్కృతి, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

ఉదయం నుంచే రిజిస్ట్రేషన్, అతిథుల స్వాగతం, హాస్పిటాలిటీ, బిజినెస్ మ్యాచ్‌మేకింగ్ సమావేశాలు, యువత కోసం ప్రత్యేక నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. విమానాశ్రయ పికప్‌ల నుంచి హోటల్ వసతి, రిజిస్ట్రేషన్, అతిథుల ఆతిథ్యం వరకు ప్రతి ఏర్పాటును అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన ఆటా బృందాన్ని పాల్గొన్నవారు ప్రశంసలతో ముంచెత్తారు.

సాయంత్రం కాక్టెయిల్ అవర్, నెట్‌వర్కింగ్‌తో ప్రారంభమైన వేడుకలు అనంతరం జరిగిన గ్రాండ్ బ్యాంక్వెట్ సభకు విశేష స్పందన లభించింది. ప్రముఖ గాయని సునీత సంగీత స్వాగతంతో కార్యక్రమం ప్రారంభం కాగా, ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్, కో-కన్వీనర్ అరవింద్ ముప్పిడి, కో-నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్, రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి మునుకుంట్ల, కో-డైరెక్టర్ కిరణ్ ఆలా తదితర ఆటా కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కన్వెన్షన్ సావనీర్‌ను ఆవిష్కరించడంతో పాటు విశిష్ట సేవలందించిన వారికి ATA అవార్డులు ప్రదానం చేశారు. దాతలు, స్పాన్సర్లు, అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. జానపద నృత్యాలు, మెడ్లీ డ్యాన్స్‌లు, సంగీత ప్రదర్శనలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణ జానపద కళాకారులు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రముఖ గేయరచయిత శ్యామ్ కాసర్ల, ఫోక్ సింగర్స్ జనార్ధన్ పన్నెల, మిట్టపల్లి సురేందర్, యాట సంధ్య ఆలపించిన జానపద గీతాలు సభలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ప్రేక్షకులు కరతాళధ్వనులతో కళాకారులను అభినందించారు.

ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను బ్యాంక్వెట్ కమిటీ చైర్ మనోహర్ ఎనుగు తన ప్రసంగంలో వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహాసభల్లో తొలి రోజు ప్రారంభోత్సవం, గ్రాండ్ బ్యాంక్వెట్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటా అవార్డుల ప్రదానోత్సవం అత్యంత విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.

ఈసారి అవార్డులు తమ మిత్రులకు దక్కడం ఎంతో గర్వకారణమని పేర్కొన్న ఆయన, మూడు రోజుల వేడుకలను సరదాగా ఒక పెళ్లి వేడుకతో పోల్చారు.

"ఈ కాన్ఫరెన్స్ ఒక పెళ్లి వేడుక లాంటిది... మొదటి రోజు సంగీత్, రెండో రోజు పెళ్లి, మూడో రోజు రిసెప్షన్ లాంటిది. ప్రతి ఒక్కరూ ఈ వేడుకలను ఆస్వాదించాలి" అని వ్యాఖ్యానించారు.

మొదటి రోజు విందు, వినోద కార్యక్రమాల అనంతరం రెండో రోజు నుంచి ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. యూత్ ఫోరమ్స్, బిజినెస్ ఫోరమ్స్, పొలిటికల్ ఫోరమ్స్, సామాజిక నెట్‌వర్కింగ్ ఈవెంట్స్‌తో పాటు అనేక కీలక సెషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కన్వీనర్ శ్రీధర్ బనాలాతో పాటు మొత్తం టీమ్ వేదిక ఏర్పాట్ల నుంచి ప్రతి కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా రూపొందించిందని ప్రశంసించారు.

గ్రాండ్ బ్యాంక్వెట్ సందర్భంగా ATA కోఆర్డినేటర్ రవి చల్లా చేసిన ప్రసంగం సభలో విశేష ఆకర్షణగా నిలిచింది.

ఈ మహాసభలకు విచ్చేసిన అమెరికన్, భారతీయ ప్రజాప్రతినిధులు, డిగ్నిటరీలు, స్పాన్సర్లు, దాతలు, భాగస్వామ్య సంస్థలు, కళాకారులు, మీడియా ప్రతినిధులందరికీ ఆటా తరపున ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు.

"ఇది కేవలం ఒక బ్యాంక్వెట్ నైట్ కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలు, ఐక్యతను ఘనంగా జరుపుకునే మహోత్సవం" అని ఆయన పేర్కొన్నారు.

ఈ మహాసభల విజయవంతం కోసం వందలాది మంది వాలంటీర్లు నెలల తరబడి అంకితభావంతో, నిస్వార్థ సేవతో పనిచేశారని గుర్తు చేశారు. అలాగే ఈ మహాసభలకు ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచిన స్పాన్సర్లు, దాతలు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మూడు రోజుల కాన్ఫరెన్స్ కేవలం సమావేశం మాత్రమే కాదని, కొత్త స్నేహాలను ఏర్పరచుకునే వేదిక, యువతకు నాయకత్వ దిశను చూపే అవకాశం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప ఉద్యమమని ఆయన అన్నారు.

"ATA అనేది కేవలం ఒక సంస్థ కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఒకే కుటుంబంగా కలిపే సేవా సంస్కృతి" అని రవి చల్లా స్పష్టం చేశారు.

యువత కోసం ప్రత్యేకంగా నిర్వహించిన బాల్టిమోర్ ఇన్నర్ హార్బర్ యూత్ క్రూయిజ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అనంతరం జరిగిన పోస్ట్ క్రూయిజ్ సోషల్ ఈవెంట్‌లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాత్రి చివర్లో Orange Street Live Band సంగీత విభావరి, ప్రముఖ గాయని సునీత గానామృతం, ఝుమ్మంది నాదం సెమీ ఫైనలిస్టుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చప్పట్లతో మార్మోగిన సభలో తొలి రోజు వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

ఇప్పుడు అందరి దృష్టి రెండో రోజు జరగనున్న యూత్, బిజినెస్, పొలిటికల్ ఫోరమ్స్, ప్రముఖ అతిథుల ప్రసంగాలు, సాంస్కృతిక వైభవం, ప్రత్యేక కార్యక్రమాలపై నిలిచింది. బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న ఈ ATA 19వ మహాసభలు ప్రవాస తెలుగు చరిత్రలో మరో చిరస్మరణీయ అధ్యాయంగా నిలవనున్నాయని నిర్వాహకులు, పాల్గొన్నవారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.