అమెరికాలో తెలుగు సంస్కృతి, భాష, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) కార్యక్రమాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత టి. హరీష్ రావు ఎప్పటికప్పుడు అభినందిస్తూ, తన మద్దతు తెలియజేస్తూ ఉంటారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ‘మాటా’ సంస్థ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా Mana American Telugu Association (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “MATA 2nd Convention 2026” అత్యంత విజయవంతం కావాలని హరీష్ రావు ఆకాంక్షించారు. అమెరికాలోని Philadelphia ప్రాంతంలో జూన్ 19-20 తేదీల్లో ఈ మహాసభలు జరగనున్నాయి.
సీతారాముల కళ్యాణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత విభావరి, వివిధ సామాజిక-సాంస్కృతిక వేదికలతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో తెలుగు వారసత్వాన్ని భావితరాలకు చేరవేయడంలో ‘మాటా’ చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని కోరుతూ నిర్వాహకులకు, పాల్గొనే తెలుగు ప్రజలందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.















