చెన్నైకు చెందిన డీప్‌టెక్‌ స్టార్టప్‌ ‘ద ఇప్లేన్‌ కంపెనీ’ అభివృద్ధి చేస్తున్న పూర్తి స్థాయి విద్యుత్తు ఎయిర్‌ ట్యాక్సీ ‘ఇ200ఎక్స్‌’ అసెంబ్లీ పూర్తయింది. భారతదేశంలో అధునాతన వైమానిక రవాణా రంగంలో ఇది ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

విమానంలోని ప్రధాన ఉపవ్యవస్థలన్నింటినీ ఒకే నిర్మాణంలో సమీకరించి ‘ఇ200ఎక్స్‌’ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. అసెంబ్లీ పూర్తి కావడంతో ఇప్పుడు ప్రత్యేక పరికరాల సహాయంతో విమాన నిర్మాణం, ఆన్‌బోర్డ్‌ వ్యవస్థల పనితీరును పరీక్షించే గ్రౌండ్‌ టెస్టింగ్‌ దశలోకి అడుగుపెట్టనుంది.

ఈ పరీక్షల్లో విమానం ఏరోడైనమిక్‌ పనితీరు, మెకానికల్‌ లోడ్‌లను తట్టుకునే సామర్థ్యం, నిర్మాణ బలం, భద్రతా ప్రమాణాలను పరిశీలించనున్నారు. వాణిజ్య వినియోగానికి ముందు ఈ పరీక్షలు అత్యంత కీలకమైనవిగా కంపెనీ పేర్కొంది.

గ్రౌండ్‌ టెస్టింగ్‌ విజయవంతంగా పూర్తయిన తర్వాత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి టైప్‌ సర్టిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేయనుంది. ఈ ధ్రువీకరణ పొందిన తర్వాతే వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి లభిస్తుంది.

ఇప్పటికే తొలి ప్రోటోటైప్‌ ‘పీటీ-01’ను పూర్తి చేసిన సంస్థ, ప్రస్తుతం ‘ఇ200ఎక్స్‌’ను డిజైన్‌, సిమ్యులేషన్‌ దశల నుంచి భౌతిక పరీక్షల దశకు తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు భారతదేశంలో విద్యుత్తు ఆధారిత ఎయిర్‌ ట్యాక్సీ సేవల అభివృద్ధికి, సుస్థిర వైమానిక రవాణా లక్ష్యాలకు కొత్త ఊతాన్ని ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.