ఫిరోజ్‌పూర్, జూన్ 6: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, జీపు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు కుటుంబ సభ్యుడి అస్థికలను నిమజ్జనం చేయడానికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎదురెదురుగా వచ్చిన వాహనాలు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












