దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని 28 ఆసుపత్రులు, వైద్య సంస్థల్లో 23 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడైంది. మంగళవారం రాజ్యసభలో సీపీఐ(ఎం) సభ్యుడు వి. శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఈ వివరాలను వెల్లడించారు.
2026-27 సంవత్సరానికి దేశంలోని 18 ఎయిమ్స్ సంస్థల్లో 4,850 ఫ్యాకల్టీ పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 1,645 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో దాదాపు 34 శాతం భర్తీ కాలేదు.
ఇక ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే 2,921 పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. అక్కడ 1,313 మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో 873 మంది పనిచేస్తుండగా.. 440 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాన్-ఫ్యాకల్టీ విభాగంలో 13,913 మంజూరైన పోస్టులకు గాను 11,432 పోస్టులు భర్తీ అయ్యాయి. దీంతో 2,481 నాన్-ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అంతేకాకుండా కొన్ని వైద్య సంస్థల్లో మంజూరైన పోస్టుల సంఖ్య కూడా తగ్గినట్లు మంత్రి సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటం వైద్య సేవలు, బోధన, ఆసుపత్రుల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశముంది.












