క్యాన్సర్‌ను ‘నోటిఫైడ్ డిసీజ్‌’గా ప్రకటించి, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడంతో పాటు బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం మిగిలిన 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే 17 చోట్ల క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది.

క్యాన్సర్‌ను దేశవ్యాప్తంగా నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించాలని కోరుతూ ప్రముఖ వైద్యుడు అనురాగ్ శ్రీవాస్తవ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌పై గత ఏడాది డిసెంబరు 12న కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం కేసును విచారించింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్‌పై ఒకే విధమైన విధానం ఉండాల్సిన అవసరాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించేలా కేంద్రం కొన్ని తప్పనిసరి మార్గదర్శకాలను ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నించింది.

కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ కౌశిక్ స్పందిస్తూ.. ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశమని తెలిపారు. ఇప్పటికే 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించినట్లు కోర్టుకు వివరించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసుల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు.

దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి.. మిగిలిన 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సిఫారసులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించేందుకు తీసుకున్న చర్యలపై ఆయా ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు.

క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా ప్రకటించడం ద్వారా వ్యాధి కేసులను సమర్థంగా నమోదు చేయడంతో పాటు తొలిదశలో గుర్తించే అవకాశాలు పెరుగుతాయని, తద్వారా బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించవచ్చని అనురాగ్ శ్రీవాస్తవ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.